దేశంలో రోజురోజుకు కొవిడ్-19 వైరస్ ఉద్ధృతి పెరుగుతున్న వేళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో.. ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడి, లాక్డౌన్ అమలు, ఆంక్షలపై చర్చించారు. మే 3 తర్వాత ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సీఎంల అభిప్రాయాలు కోరారు ప్రధాని.
ఇప్పటికే దేశం సుదీర్ఘ దిగ్బంధంలో ఉన్న నేపథ్యంలో దశల వారీగా లాక్డౌన్ ఎత్తివేసే అంశంపై మోదీ.. సీఎంలతో చర్చించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
కరోనా నేపథ్యంలో.. తొలుత లాక్డౌన్కు ముందు మార్చి 22న తొలిసారి సీఎంలతో చర్చించిన ప్రధాని.. మార్చి 24న 21 రోజుల లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం.. ఏప్రిల్ 11న మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి లాక్డౌన్ను 19 రోజులు పొడిగించారు.
మరోసారి పొడిగింపు?
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచాలని, ఆర్థిక సాయం అంశాలను మోదీ వద్ద పలు రాష్ట్రాలు ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ను మరిన్ని రోజులు పొడిగించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
దేశంలో ఇప్పటివరకు 27,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 872 మంది మృత్యువాతపడ్డారు.