ETV Bharat / bharat

జనారోగ్య సమరంలో 'కరోనా' రావణ సంహారం కావాలి!

ప్రస్తుతం మనచుట్టూ జరుగుతున్న కథ సరిగ్గా రామాయణ, మహాభారతాలను పోలి ఉంది. జాంబవంతుడి పాత్రలో ప్రధానమంత్రి జాతిని ప్రేరేపిస్తున్నారు. కదం తొక్కండంటూ స్ఫూర్తి నింపుతున్నారు. గుడిలో చర్చిలో మసీదులో ప్రార్థనలు అందుకొనేవారంతా- వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, రక్షకభటుల రూపాల్లో కరోనా రావణ సంహారానికి కంకణం కట్టుకుని అనుక్షణం శ్రమిస్తున్నారు.

author img

By

Published : Mar 29, 2020, 9:00 AM IST

india fights coronavirus
జనారోగ్య సమరం!

నలుదెసలా చిక్కని దుఃఖం ఆవరించింది. నిశ్శబ్దం వ్యాపించింది. గాలి పూర్తిగా స్తంభించింది. ప్రాణభయంతో అందరికీ ఊపిరి ఆగిపోయేలా ఉంది. అంతలో నెమ్మదిగా ఒక ఎలుగుబంటి లేచింది. దూరంగా మౌనంగా కూర్చున్న ఒక కోతిని సమీపించింది. సంభాషణ ఆరంభించింది. 'నాయనా! ఏమిటలా చేతకానివాడిలా కూర్చున్నావు... విపత్తు భయంకరమైనదే కాని నీవు జయించలేనిదేమీ కాదు... నీవెంతటివాడవో ఒక్కసారి గుర్తుచేసుకో... ఈ నిన్‌ మించరు వైనతేయుడునుగానీ రామసౌమిత్రులుంగానీ శౌర్యమునన్‌ బలంబునను వేగంబందు... నీవొకడవు కాకుండగ ఈ వానరసేన దుఃఖము ఎవ్వడు తీర్చున్‌...' అంటూ గట్టిగా ప్రోత్సహించింది.

మారుతిగా కోతి..

ఆ ధీరోదాత్త గంభీర భావచ్ఛటా వరణీయోత్తమ శబ్ద సంతతులకు ఆకాశం దద్దరిల్లింది. ఒక్కసారిగా కోతి మారుతిగా ఆవిర్భవించింది. త్రివిక్రమాకృతి దాల్చింది. దేహం శ్రీరామ ఆరామమై... బాహుదండం కోదండమై... కంఠం ఆ వింటినారివలె దిక్కులు పిక్కటిల్లేలా ఉరిమింది. 'పుడమిం చీల్చెద రెండుగా నడిమికిన్‌, భూమీధరంబుల్‌ పొడింపొడిగా చేసెద, వార్థివారి ధరణిం పూరింతు గగ్గోలుగా' అంటూ భీకరంగా గర్జించింది. గగనమై ప్రతిధ్వనించింది. హనుమ సముద్రాన్ని లంఘించాడు. సీతమ్మను దర్శించాడు. లంకను దహించాడు. విజయం సాధించాడు. ఒక మహావిపత్తు ఈ లోకాన్ని తన ధృతరాష్ట్ర కౌగిలిలో బంధించి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నవేళ రామాయణాన్నిఆరాదించేవారంతాతక్షణం ఆవాహన చేసుకోవలసిన ఒక పరమధర్మాన్ని విశ్వనాథ హనుమ నోట పలికించారు. 'ఎంతటివాడు కావలయు ఎప్పుడు యత్ప్రతిభా విశిష్టుడై- అంతటివాడు నేనగుదు నప్పుడు తత్ప్రతిభా విశిష్టుడై' అని! అలా ఎదగడమే ఈ జాతి తక్షణ కర్తవ్యం. అదే రామాయణ సందేశం.

కాకాసురిడిపై బ్రహ్మాస్త్రం

కాకాసురుడి కథ మనకు తెలిసిందే. సీతమ్మ ఒళ్లో రామయ్య సేద తీరుతున్నవేళ ఒక కాకి వచ్చి ఆమె వక్షాన్ని గాయం చేసింది. 'నెత్తురు ముద్దై స్వామియు ఒత్తిగిలుటలోన తడియునొరసిన నిద్రామత్తత చెడగా మేల్కొని' కోపంతో మండిపడ్డాడు. గడ్డిపరకను పీకి బ్రహ్మాస్త్రంగా మంత్రించి వదిలాడు. కాకాసురుడు ఎన్ని లోకాలకు పారిపోయినా అస్త్రం అన్ని లోకాల్లోనూ వెంటాడింది. కూర్చున్న చోటునుంచి కదలకుండా, కోదండంతో పనిలేకుండా ఏ లోకంలో ఉన్న శత్రువునైనా చిటికెలో సంహరించగల సామర్థ్యం రాముడిది. కాకాసురుడిపై ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని కిష్కింధలోనే కూర్చుని లంకాసురుడిపై ప్రయోగించవచ్చు కదా... అనేది ప్రశ్న. అలా చేస్తే కోతిని మారుతిని చేసేదెట్లా? 'అదియొక సేనకాదు, సకలావని భూధరవార్థి వానరుల్‌ గుదులుగ వచ్చి ఏర్పడిన కూటమి, పేరికి వారె వానరుల్‌' అని విశ్వనాథ అన్నట్లుగా సాధారణమైన కోతులను అసామాన్య సైనికులుగా మలచేదెట్లా? ఉడుతల్లాంటి అల్పజీవులను సుశిక్షితులైన శ్రామికులుగా మార్చి వారధి నిర్మించేదెలా?

పక్కకు తొలగడమూ రణతంత్రంలో భాగమే

ఒక మహమ్మారి మానవ జాతిని కబళించాలని దండెత్తివస్తే మనం ఆ బడుగుజీవుల పాటి చేయలేమా? రామాయణం మనకు నేర్పుతున్న పాఠం ఏమిటి? మనమే కాదు, లక్ష్మణుడి యుద్దమూ కనిపించని శత్రువు (ఇంద్రజిత్తు)తోనే! తండ్రి ద్రోణాచార్యుడి మరణంతో 'పగ'భగలాడిన ఆశ్వత్థామ పాండవులపై నారాయణాస్త్రాన్ని సంధించాడు. 'అరి ప్రకరంబులు పిచ్చలింపగన్‌...' శత్రు సమూహం సైతం మెచ్చుకొనేలా 'తీవ్రశరంబుల వైభవంబు భూరి గద విహార భంగి' విజృంభిస్తానంటూ భీముడు తెంపరితనం ప్రదర్శించాడు.తగుదునమ్మా అని తలెగరేస్తే తలతరిగేసే నారాయణాస్త్రం, తలవంచి నమస్కరిస్తే మాత్రం పక్కకు తొలగి క్రమంగా శాంతిస్తుంది. అది తెలిసిన కృష్ణార్జునులు 'దుడుకు నాబుద్ధి విని దిగను ఉరుకు తేరు...' వెంటనే రథంనుంచి దూకమంటూ బలవంతాన భీముణ్ని కిందకి తోసేశారు. నిజానికి పరాజయం కాదది- రణతంత్రంలో భాగం.

ఇది అదే కథ!

ప్రస్తుతం మనచుట్టూ జరుగుతున్న కథ సరిగ్గా ఇదే. జాంబవంతుడి పాత్రలో ప్రధానమంత్రి జాతిని ప్రేరేపిస్తున్నారు. 'కదం త్రొక్కుతూ పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ... త్రాచులవలెనూ రేచులవలెనూ ధనంజయునిలా సాగండి' అంటూ స్ఫూర్తి నింపుతున్నారు. దాంతో గుడిలో చర్చిలో మసీదులో ప్రార్థనలు అందుకొనేవారంతా- వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, రక్షకభటుల రూపాల్లో కరోనా రావణ సంహారానికి కంకణం కట్టుకుని అనుక్షణం శ్రమిస్తున్నారు. 'సిరికిం చెప్పని హరిలా' ఇంట్లో భార్యాపిల్లలను వదిలేసి 'జన ప్రాణ సంరక్షణోత్సాహులై...' పరిక్రమిస్తున్నారు. పురాణ వాంగ్మయం ఈ జాతికి నూరిపోస్తున్నది- పిరికితనాన్ని కాదు, అచంచల త్యాగనిరతిని... అని నిరూపిస్తున్నారు.

మనవైపు చూస్తున్న ప్రపంచం

'భా' అంటే కాంతి వెలుగు వికాసం తేజస్సు. వాటియందు రతిభావం కలవాడే భారతీయుడు. 'సర్వేజనాస్సుఖినోభవన్తు' అనేది ఈ దేశం లోకానికి అందించిన సందేశం. అందుకే ప్రపంచం మళ్లీ మనదేశంవైపు దృష్టి సారిస్తోంది. వెలుగులు పంచగలమని ఆశిస్తోంది. 'కరోనాను భారత్‌ జయించగలదు' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార ప్రతినిధి మైకేల్‌ర్యాన్‌ జెనీవాలో చేసిన ప్రకటనకు తాత్పర్యం అదే. మన బాధ్యతను స్థాయిని గుర్తుచేసే అంశమది. మరోవైపు సాధారణ జనాన్ని ప్రభుత్వాలు కోరుతున్నదొకటే- 'నీ ఒంట్లో నువ్వుండాలనుకొంటే- నీ ఇంట్లోనే నువ్వు ఉండు' అని. కాదూకూడదని వీధుల్లో తిరుగుతానంటే రక్షకభటులు- భీముణ్ని రథంనుంచి ఈడ్చేసిన కృష్ణార్జునులు అవుతారు. తమస్సు ఆవరించినప్పుడు తపస్సొకటే శరణ్యం. 'శార్వరి' అంటే రాత్రి. అది సుప్రభాత వికాసాలకు నాంది. 'వికారా'లకు స్వస్తి పలుకుతూ ఆ వెలుగులకోసం ఎదురుచూద్దాం... దీక్ష పూని!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.