కరోనా వ్యాప్తితో విధించిన ఎగుమతుల ఆంక్షలు.. ప్రభుత్వం ఇటీవల సడలించిన తర్వాత జులైలో 23 లక్షల పీపీఈ కిట్లను ఐదు దేశాలకు ఎగుమతి చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అమెరికా, బ్రిటన్, యూఏఈ, సెనెగల్, స్లోవేనియా దేశాలు ఇందులో ఉన్నాయి.
ఇలా ఎగుమతి చేయటం వల్ల ప్రపంచ మార్కెట్లో భారత్ స్థానం సుస్థిరంగా మారినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పీపీఈ కిట్లను, ఇతర వైద్య పరికరాలను తయారు చేయటం వల్ల స్వయం సమృద్ధి ఏర్పడినట్లు తెలిపింది.
విదేశాలకే కాకుండా కరోనా నియంత్రణలో రాష్ట్రాలకు సాయం చేసినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. మార్చి నుంచి ఆగస్టు మధ్య కాలంలో 1.40 కోట్ల పీపీఈ కిట్లను దేశీయంగా తయారుచేయగా, వాటిలో 1.28 కోట్ల కిట్లను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర సంస్థలకు ఉచితంగా పంపిణీ చేసినట్లు పేర్కొంది.
ఇదీ చూడండి:బిహార్ ఎన్నికల్లో ఫడణవీస్ కీలక పాత్ర