జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దును విమర్శించిన టర్కీ, మలేసియా ప్రభుత్వాల్ని తప్పుబట్టింది కేంద్రం. కశ్మీర్ భారత అంతర్గత అంశమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని అర్థం చేసుకొని మాట్లాడాలని టర్కీకి హితవు పలికారు.
మలేసియా ప్రధాని వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయన్న రవీశ్... దీనిపై చింతిస్తున్నట్లు తెలిపారు. మలేసియా ప్రధాని మహథిర్ మహ్మద్.. ఇటీవల కశ్మీర్ అంశాన్ని ఐరాసలో లేవనెత్తారు. జమ్ముకశ్మీర్‌ను భారత్ ఆక్రమించుకుందని ఆరోపించిన మహ్మద్.. పాక్‌తో చర్చించి సమస్య పరిష్కరించుకోవాలని అన్నారు.
''మలేసియా, టర్కీ చేసిన ప్రకటనలు ఆందోళనకరంగా ఉన్నాయి. టర్కీ భారత్‌కు మిత్ర దేశం. ఆగస్టు 6 నుంచి టర్కీ ప్రభుత్వం.. భారత్‌కు పూర్తిగా అంతర్గత విషయంలో చేస్తున్న వరుస ప్రకటనల పట్ల తీవ్రంగా చింతిస్తున్నాం. ఈ ప్రకటనలు పూర్తిగా అసత్యమైనవి, ఏకపక్షం. భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు చేసే ముందు పూర్తి వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకొని మాట్లాడేలా మేం వారితో చర్చిస్తాం. మలేసియాతోనూ మంచి సంబంధాలున్నాయి. ఇటీవల ఇంకా బలపడ్డాయి. ఇలాంటి సందర్భంలో మలేసియా ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచాయి. ఈ అసత్య ప్రకటనల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం.''
- రవీశ్ కుమార్, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి