దేశంపై కరోనా పంజా విసురుతూనే ఉంది. రోజూ వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అత్యధిక కేసులు గల రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్ధానాల్లో తమిళనాడు, దిల్లీ, గుజరాత్, కర్ణాటక ఉన్నాయి.
మహారాష్ట్రలో..
మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రికార్డు స్థాయిలో కొత్తగా 12,608 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. 364 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 5,72,734కు చేరాయి. ఫలితంగా 19,427 మంది ప్రాణాలు కోల్పోయారు.
కర్ణాటకలో...
కర్ణాటకలో కొవిడ్ ఉగ్రరూపం దాల్చుతోంది. రోజు రోజుకు కొత్త కేసుల నమోదులో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇవాళ ఏకంగా 7,908 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. 104 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2,11,108కు, మరణాలు 3717కు చేరాయి.
తమిళనాడులో..
తమిళనాడులో కరోనా మహమ్మారి అంతకంతకూ ఉగ్రరూపం దాల్చుతోంది. కొత్తగా 5,890 కేసులు నమోదవ్వగా... 117 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసులు 3,26,245, మరణాలు 5,514కు చేరాయి. 53,716 మంది చికిత్స పొందుతున్నారు.
దిల్లీలో మళ్లీ..
దేశ రాజధాని దిల్లీలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 1,192 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 11 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 1,50,652కు చేరింది. ఇందులో 1,35,108 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఇంకా 11,366 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు హస్తినలో 4178 మంది ప్రాణాలు కోల్పోయారు.
కేరళలో...
కేరళలో వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొత్తగా 1569 మందికి వైరస్ నిర్ధరణ కావటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 26,996 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 14,094 మంది చికిత్స పొందుతున్నారు
- హిమాచల్ ప్రదేశ్‌లో తాజాగా నమోదైన కేసులతో కలిపి 3542 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా 1,325 మంది చికిత్స పొందుతుండగా, 2,474 మంది కోలుకున్నారు.
- కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో తాజాగా 540 కేసులు వెలుగు చూశాయి. వీటిలో 119 జమ్ములో, 421 కశ్మీర్లో బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 27,489కి చేరింది.
- కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా 8,48,728 నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం 2,76,94,416 టెస్టులు చేసింది. అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నప్పటికీ కోలుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 17.5 లక్షల మంది మహమ్మారి నుంచి కోలుకోగా... రికవరీ రేటు 71.17 శాతం నమోదైంది. మరణాలు రేటు కేవలం 1.95 శాతం ఉండటం ఊరటనిచ్చే అంశం.
ఇదీ చూడండి:గల్వాన్ లోయ యోధులకు శౌర్య పతకం!