భారత్, చైనా సైనికుల మధ్య ఉద్రిక్తతల తాకిడికి హిమమయ లద్దాఖ్‌లో వేడి రాజుకుంటోంది. ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌పై పోరులో నిమగ్నమైన వేళ.. అదును చూసి ‘డ్రాగన్’ బుసలు కొడుతోంది. సరిహద్దుల్లో ప్రశాంతతకు భంగం కలిగించేలా వేల సంఖ్యలో సైన్యాన్ని తరలించింది. చైనాకు దీటుగా మన సైన్యం కూడా అక్కడ బలగాలను మోహరించింది. ఇప్పుడు ఇరు దేశాల సైనికులు ఢీ అంటే ఢీ అనే రీతిలో ఎదురెదురుగా నిలబడ్డారు.
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే 2017 నాటి ‘డోక్లామ్ సైనిక ప్రతిష్టంభన’ తర్వాత మరో పెద్ద సైనిక వివాదం తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మంగళవారం అత్యున్నత స్థాయి భేటీ నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. అంతకుముందు విదేశీ వ్యవహారాల కార్యదర్శితోనూ మోదీ విడిగా సమావేశమయ్యారు. త్రివిధ దళాధిపతులు ప్రత్యేకంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోనూ భేటీ అయ్యి, తాజా పరిస్థితిని చర్చించారు.
కొద్దిరోజుల కిందట తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్, సిక్కింలో భారత్, చైనా సైనికులు రాళ్లు, ఇనపకడ్డీలు, పిడిగుద్దులతో పరస్పరం తీవ్రంగా దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణల్లో ఇరు దేశాలకు చెందిన అనేక మంది జవాన్లు గాయపడ్డారు. అప్పట్నుంచి లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. గాల్వాన్ లోయ, దెమ్చోక్, దౌలత్ బేగ్ ఓల్డీ వంటి సున్నిత ప్రాంతాలకూ ఉద్రిక్తతలు పాకాయి. పాంగాంగ్ సరస్సు వద్ద.. చైనా బలగాలు వాస్తవాధీన రేఖను దాటి 2-4 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి.
కంటగింపు ఇందుకే..
గత కొన్నేళ్లలో చైనాకు దీటుగా భారత్ కూడా సరిహద్దు ప్రాంతంలో రోడ్లు, చిన్నపాటి వైమానిక స్థావరాలు, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేసుకుంటోంది. మొత్తం మీద 3,346 కిలోమీటర్ల పొడవైన 61 సరిహద్దు రోడ్లను నిర్మిస్తోంది. దీనివల్ల ఎల్ఏసీ వద్దకు సులువుగా బలగాలను చేరవేయడానికి, చైనా ‘దురుసుతనానికి’ సకాలంలో అడ్డుకట్ట వేయడానికి భారత్‌కు వీలవుతోంది. ఇదే పొరుగు దేశానికి కంటగింపుగా మారినట్టు రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వివాదరహిత గాల్వాన్ ప్రాంతం వద్దా చైనా మోహరింపులు చేపట్టడంపై రక్షణ నిపుణుడు కమోడోర్ సి.ఉదయ్ భాస్కర్ విస్మయం వ్యక్తంచేశారు. ‘‘గాల్వాన్‌లో జరిగింది చాలా తీవ్రమైన అంశం. సాధారణ చొరబాటు యత్నం కాదు’’ అని మాజీ సైనికాధికారి లెఫ్టినెంట్ జనరల్ డి.ఎస్.హూడా చెప్పారు. చైనా ఎంత యాగీ చేసినా ఎల్ఏసీ వెంబడి మౌలిక వసతుల అభివృద్ధిని ఆపకూడదని భారత్ గట్టిగా తీర్మానించుకుంది. సుదీర్ఘ సైనిక ప్రతిష్టంభనకు సిద్ధమేనన్న సంకేతాన్ని పొరుగు దేశానికి పంపింది.
కొవిడ్-19 మహమ్మారి వల్ల అనేక దేశాల్లో లక్షల మంది చైనావాసులు చిక్కుకుపోయారు. అయినా భారత్‌లో ఉన్న తన పౌరులను మాత్రమే ఆగమేఘాల మీద స్వదేశానికి తరలించాలని చైనా నిర్ణయించింది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ నిర్ణయాన్ని తీసుకొని ఉండొచ్చని ఉదయ్ భాస్కర్ విశ్లేషించారు.
నేపాల్‌నూ ఉసిగొల్పి..
నేపాల్‌నూ చైనా ఉసిగొల్పుతోందని, ఆ ఫలితంగానే గతవారం ఒక కొత్త రాజకీయ మ్యాప్‌ను నేపాల్ తెచ్చిందని నిపుణులు చెబుతున్నారు. అందులో లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలను తన భూభాగంలో ఆ దేశం చూపింది. సైనిక ఉద్రిక్తతలు, అస్థిరత ద్వారా భారత్‌లో ఆర్థిక వృద్ధిని దెబ్బతీయడమూ చైనా వ్యూహమై ఉండొచ్చని భావిస్తున్నారు.
డోక్లామ్‌లో..
2017లో భూటాన్‌లోని డోక్లామ్‌లో 73 రోజుల పాటు భారత్, చైనాల మధ్య సైనిక ప్రతిష్టంభన ఏర్పడింది. ఉభయ దేశాలను ఇది యుద్ధం ముంగిట్లోకి తీసుకెళ్లింది. అయితే రాజకీయ, దౌత్య చర్చల ద్వారా వివాదం పరిష్కారమైంది.
నింగిలోనూ..
కొన్నిచోట్ల సైనిక హెలికాప్టర్లనూ చైనా రంగంలోకి దించింది. బదులుగా భారత అగ్రశ్రేణి యుద్ధవిమానాలైన సుఖోయ్-30లు అక్కడ చక్కర్లు కొట్టాయి. కొత్తగా రూపొందించిన ‘ఏఆర్500సి’ అనే మానవ రహిత హెలికాప్టర్‌ను భారత్ వెంబడి ఉన్న సరిహద్దుల్లో మోహరించనున్నట్లు చైనా అధికారిక మీడియా తాజాగా ప్రకటించింది. దాడి చేసే సామర్థ్యం దీనికి ఉందని, 15వేల అడుగుల ఎత్తు నుంచి ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను ధ్వంసం చేసే సత్తా దీని సొంతమని వివరించింది.
వైమానిక స్థావరాన్ని విస్తరిస్తున్న చైనా
పాంగాంగ్ సరస్సు, గాల్వాన్ లోయ, దెమ్చోక్ ప్రాంతాల్లో వేల మందిని చైనా సైన్యం మోహరించినట్లు సమాచారం. గాల్వాన్ లోయలో గత రెండు వారాల్లో దాదాపు 100 వరకూ గుడారాలు వేసినట్లు, బంకర్ల నిర్మాణం కోసం భారీ సామగ్రిని రప్పించినట్లు తెలుస్తోంది. లద్దాఖ్ వద్ద ఒక వైమానిక స్థావరాన్ని చైనా విస్తరిస్తున్నట్లు, అక్కడ యుద్ధవిమానాలు మోహరించినట్లు కూడా సమాచారం. చైనాకు దీటుగా భారత్ కూడా బలగాలు, సామగ్రిని మోహరిస్తోంది. ‘‘గాల్వాన్ ప్రాంతంలో ప్రత్యర్థి కన్నా మన బలం చాలా ఎక్కువగా ఉంది’’ అని భారత సైనికాధికారి ఒకరు పేర్కొన్నారు.
యుద్ధ సన్నద్ధతను బాగా మెరుగుపరచుకోవాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మంగళవారం తన సైన్యాన్ని ఆదేశించారు. సంక్లిష్ట పరిస్థితులను ముందుగానే ఊహించుకొని, వాటిని ఎదుర్కొనేలా సన్నద్ధం కావాలన్నారు. భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో... సైనిక ప్రతినిధులతో జరిగిన ప్లీనరీలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సరిహద్దు వివాదం..
- భారత్- చైనాల నడుమ సరిహద్దు వివాదం.. 3,488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) పొడవునా విస్తరించి ఉంది.
- అరుణాచల్ తనదేనని చైనా వాదిస్తోంది.
- ఇరు దేశాల మధ్య 1962లో యుద్ధం జరిగింది.
- ఆ తర్వాత సరిహద్దు వివాదం పరిష్కారమయ్యే వరకూ అక్కడ శాంతిని కాపాడాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి. అందువల్ల గత కొన్ని దశాబ్దాల్లో అక్కడ ఒక్క తూటా కూడా పేలలేదు.
- ఎల్ఏసీకి సంబంధించి తమ వైఖరికి అనుగుణంగా ఇరుపక్షాలు గస్తీ నిర్వహిస్తుంటాయి.
- ఈ క్రమంలో ‘అతిక్రమణల’ ఆరోపణలు వినపడుతుంటాయి.