సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించే అంశంలో భారత్-చైనాలు కీలక పురోగతి సాధించాయి. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ, పెట్రోలింగ్ పాయింట్ 15, హాట్ స్ప్రింగ్స్/గోగ్రా వద్ద బలగాల ఉపసంహరణను ఇరు దేశాలు పూర్తి చేసినట్టు సైనిక అధికారుల సమాచారం.
"భారత్-చైనా మధ్య మిలిటరీ, దౌత్యస్థాయిలో జరుగుతున్న చర్చలు సఫలం అయ్యాయి. తూర్పు లద్దాఖ్‌లోని పెట్రోలింగ్ పాయింట్ 14(గల్వాన్ లోయ), పెట్రోలింగ్ పాయింట్15, 17ఏ(హాట్ స్ప్రింగ్స్/గోగ్రా)లో ఇరు దేశాలు తమ బలగాలను ఉపసంహరించుకున్నాయి."
--- భారత సైనికాధికారి.
గత కార్ప్స్ కమాండర్ల స్థాయిలో జరిగిన చర్చల్లో అంగీకరించినట్టుగానే బలగాలు వెనుదిరిగాయి. దీంతో ఇక ఒక్క పాంగ్యాంగ్ ట్సో వద్ద ఉన్న ఫింగర్ పాయింట్ నుంచి మాత్రమే బలగాలు వెనుదిరగాల్సి ఉంది. దీనిపై వచ్చే వారంలో మిలిటరీ కమాండర్ల స్థాయిలో సమావేశం జరిగే అవకాశముంది.
అయితే ఇరువైపులా బలగాల ఉపసంహరణ జరుగుతున్నప్పటికీ.. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా తాజాగా మరో 40వేల మంది సైనికులను మోహరించడం ఆందోళన కలిగించే విషయం.
ఇదీ చూడండి:- చైనాను ఎదుర్కొవడానికి భారత్ దౌత్య అస్త్రం!