చైనాలో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు వెళ్లిన రెండో విమానం దిల్లీకి చేరుకుంది. ఎయిర్ ఇండియా జంబో బి747 విమానం.. వుహాన్ నుంచి 323 మంది భారతీయులు, ఏడుగురు మాల్దీవులకు చెందిన వారితో దిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. ఇప్పటి వరకు మొత్తం 654 మందిని చైనా నుంచి తరలించినట్లు వెల్లడించారు అధికారులు.
"వుహన్,హుబే నగరాల నుంచి ప్రయాణికులను తరలించటానికి నిర్విరామంగా 96 గంటల పాటు కృషి చేసినందుకు బీజింగ్‌లోని మా బృందానికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. నలుగురు భారతీయులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న క్రమంలో రెండో ప్రత్యేక విమానంలో వారిని తీసుకురాలేదు."
-విక్రమ్ మిస్త్రి, చైనాలోని భారత రాయబారి
.
భారత్‌కు చేరుకున్న వారికి వైరస్ సోకిందో లేదో తెలుసుకునేందుకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు. వుహాన్ నగరంలో మరో 100 మంది వరకు భారతీయులు ఉండి ఉంటారని పేర్కొన్నారు.
304 మంది మృతి..
కరోనా ధాటికి చైనాలో ఇప్పటి వరకు 304 మంది మరణించారు. 14,380 మంది ఈ వైరస్ బారిన పడినట్లు అధికారులు ప్రకటించారు.
ఇదీ చదవండి: 'ఆశల పద్దు' అందరిని ఆనంద పరిచేనా?