ఆమె ఒంటరి తల్లి. ఇంట్లో పసి పిల్లలని వదిలి బయటకు వెళ్లి అవసరమైన మందులు, కాయగూరలు తెచ్చుకోలేని దుస్థితి. వాళ్లు వయసు మళ్లిన వాళ్లు. ఆస్పత్రికి వెళ్లడానికి తోడు ఎవరూ లేరు. ఇలాంటి వారికి సాయం చేయడానికి ముందుకొచ్చారు కేరళ షీ టాక్సీ మహిళలు. వీరంతా ఒంటరి మహిళలకు, వృద్ధులకు ఉచితంగా సేవలను అందిస్తున్నారు..
వారికి ఉచిత మందులు
దేశమంతా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ కేరళ ప్రభుత్వం మార్చి 5 నుంచి ‘షీ టాక్సీ’ ఉచిత సేవలను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆ రాష్ట్రంలోని వృద్ధులు, ఒంటరి మహిళలు అత్యవసర సమయంలో ఆసుపత్రులకు వెళ్లేందుకు, మందులు తెచ్చుకునేందుకు ఈ సేవలను పూర్తిగా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కే కే శైలజ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. మందులు కావాలనుకునేవారు డాక్టర్ రాసిచ్చిన చీటీని కాల్ సెంటర్ ఫోన్ నంబర్లకు వాట్సాప్ చేయొచ్చు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఈ సేవలన్నీ పూర్తిగా ఉచితం. మిగతావారు ఎంత మొత్తమవుతుందో అందులో సగం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: భవితను మనమే నిర్మించుకుందాం!