రక్షణ రంగం... దేశ భద్రతకు ఎంతో కీలకం. అందుకే ఏటా బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయించేది ఆ రంగానికే. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక పద్దులోనూ అన్నింటికంటే ఎక్కువగా రూ. 3.23 లక్షల కోట్లు కేటాయించారు. గతేడాదితో పోల్చితే ఇది ఎక్కువే. కానీ... అసలు మెలిక ఇక్కడే ఉంది. కొన్నేళ్లుగా రక్షణ రంగానికి కేటాయింపులు నామమాత్రంగా పెరుగుతున్నాయి. అంకెలపరంగా బాగానే ఉన్నా... జీడీపీలో వాటాపరంగా చూస్తే మాత్రం కేటాయింపులు తగ్గుతున్నాయి. త్రివిధ దళాల ఖర్చులూ పెరుగుతున్నాయి. ఫలితంగా అరకొర నిధులతో రక్షణ వ్యవస్థ ఆధునికీకరణ చెప్పుకోదగ్గ స్థాయిలో సాగడంలేదు.
"దేశ భద్రతే తొలి ప్రాధాన్యం" అని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కానీ... ఆ ప్రకటనకు తగిన స్థాయిలో కేటాయింపులు మాత్రం చేయకపోవడం గమనార్హం. వాస్తవానికి... ఇక్కడ గమనించాల్సిన అంశాలు రెండు ఉన్నాయి. మొదటిది... మాంద్యం, పేదరికం వంటి సవాళ్ల మధ్య నిధుల పెంపు నిజంగా అవసరమా? రెండోది... ఉన్న నిధులతోనే రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేయడం ఎలా?
ఆయుధాలా? ఆకలి తీర్చడమా?
రక్షణ రంగానికి అత్యధికంగా నిధులు కేటాయించే దేశాల జాబితాలో ఇప్పటికే భారత్‌ది నాలుగో స్థానం. ప్రజల జీవితంతో నేరుగా ముడిపడిన విద్య, ఆరోగ్యానికి కేటాయింపులు మాత్రం అంతంతే. ఆ రెండు కీలక రంగాలకు కలిపి భారత్ వెచ్చిస్తోంది జీడీపీలో ఒక శాతం కంటే తక్కువే. ఆర్థిక మందగమనం సంగతి సరేసరి. ఇలాంటి పరిస్థితుల్లో.. రక్షణ రంగంపై ఖర్చు పెంచడం తగునా? ఒక్కొక్కటి రూ.1600 కోట్లకుపైగా విలువచేసే రఫేల్ జెట్లను మరిన్ని కొనుగోలు చేయడం అవసరమా?
నెలకు రూ. 4200తో గడుపుతూ.. 5 కోట్లకుపైగా మంది తీవ్ర పేదరికంలో మగ్గుతున్న దేశం మనది. 2019 డిసెంబర్ మింట్ నివేదిక ప్రకారం.. గత ఆరేళ్లలో 3 కోట్ల మంది దారిద్ర్యరేఖ దిగువకు చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో పేదరిక నిర్మూలన కంటే ఆయుధాల కొనుగోలుకే ప్రాధాన్యం ఇవ్వాలా..?
మరి దేశ భద్రత సంగతేంటి?
భద్రతాపరంగా ఉన్న ముప్పుల్ని ఎదుర్కొనేందుకు, అంతర్జాతీయ సమాజంలో మన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు రక్షణ బడ్జెట్ ఎంతో కీలకం. దక్షిణాసియా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత అస్థిర ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. భారత్‌కు పశ్చిమాన శత్రుదేశం, ఉత్తరాన గొప్ప శక్తిగా ఎదుగుతున్న చైనా ఉండనే ఉంది. ఆ రెండు దేశాల నుంచి ఉన్న ముప్పు భవిష్యత్‌లోనూ కొనసాగుతుంది.
చైనాతోనే సవాల్...
వచ్చే దశాబ్దంలో పాకిస్థాన్‌ను సైనికపరంగా నిలువరించడం సులువే కావచ్చు... అయితే చైనానే తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. చైనా రక్షణ రంగం బడ్జెట్.. 250 బిలియన్ డాలర్లకుపైనే. ఇది భారత్ కంటే నాలుగు రెట్లు అధికం. రానున్న సంవత్సరాల్లో ఇది మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. 2030 కల్లా భారత్, చైనాలు సైన్యం కోసం వరుసగా 213, 736 బిలియన్ డాలర్లు కేటాయిస్తాయని.. ఐరోపా కమిషన్ అంచనా వేసింది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం దాదాపు 500 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం.
చైనా ఈ స్థాయిలో రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులు చేస్తోందంటే... భవిష్యత్ పరిణామాలు అంతే తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికే ఇందుకు కొన్ని ఉదాహరణలు చూశాం. అమెరికా, చైనా ఇప్పటికే వాణిజ్య, సాంకేతిక యుద్ధాలకు తెరలేపాయి. ఇది ప్రపంచాన్నే ప్రభావితం చేయొచ్చు. భారత్ కూడా ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలకు పోటీనిస్తోంది. ప్రపంచంలో ఓ బలీయమైన శక్తిగా భారత్ అవతరించాలంటే ఇప్పుడే దూకుడు పెంచాల్సి ఉంది. ఎంతో కాలం సమస్యల్ని సున్నితంగా పరిష్కరించడం సాధ్యం కాకపోవచ్చు.
మరి ఎలా ముందుకు?
ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల మధ్య రక్షణ రంగానికి ఇంతకన్నా కేటాయింపులు పెరగవన్నది వాస్తవం. అందుబాటులో ఉన్న వనరులతోనే సమర్థంగా ముందుకు సాగడం అసలు సవాలు.
రక్షణ బడ్జెట్లో ఎక్కువభాగం వెళ్లేది సిబ్బంది అధిక వేతనాలు, పింఛన్లకే. అయితే... వేతనాలు ఒక నిర్దిష్ట పరిమితి కంటే తగ్గించలేం. ప్రతిభావంతుల్ని ఈ కష్టసాధ్యమైన వృత్తి(సైన్యం)లోకి ఆహ్వానించాలంటే.. ఇక్కటి పరిస్థితులు(ఉద్యోగ, జీవిత భద్రత) వారిని ఆకర్షించాలి. అమెరికా ఈ విషయంలో ఎంతో ముందుంది. సైనిక బడ్జెట్లో దాదాపు 40 శాతం సిబ్బంది వేతనాలు, వారి ప్రయోజనాల కోసమే కేటాయిస్తారు.
పింఛన్లదీ అదే పరిస్థితి. ప్రాణాలను ఫణంగా పెట్టి.. జాతికి సేవలందించిన వ్యక్తి భద్రతకు దేశం భరోసాగా ఉండాల్సిందే. భారత్‌లో విశ్రాంత సైనికులకు ఇచ్చే పింఛన్లు... ఇతర దేశాలతో దాదాపు సమానంగానే ఉన్నాయి.
బడ్జెట్లో సిబ్బంది వేతనాలకు కేటాయింపులు తగ్గించలేం. అయితే... ఈ పరిస్థితుల్లోనే ప్రపంచం వెంట పరిగెత్తాలి. కొత్త మార్గాలను అన్వేషించుకోవాలి. 40 సంవత్సరాలుగా సైన్యంలో సేవలందించిన వ్యక్తిగా నా అభిప్రాయం చెబుతున్నా... ముఖ్యంగా సాయుధ దళాల పరిమాణంపై దృష్టి సారించాలి. మన సైనిక సిబ్బందిని క్రమంగా తగ్గించుకోవాలి. త్రివిధ దళాధిపతి(సీడీఎస్) ఆ దిశగా ఆలోచన చేయడం శుభపరిణామం.
ఇలా చేయొచ్చు...
కొన్ని సైనిక యూనిట్లలో రిజర్విస్ట్ మోడల్ (సైనిక వృత్తిలో పౌరుల్ని భాగం చేయడం.. అవసరమైన సమయంలో సిద్ధంగా ఉండటం)ను అవలంబించనూ వచ్చు. ఇది సైన్యంలో మానవశక్తిని పరిమితం చేయడానికి దోహదపడుతుంది. దీనితోపాటు... 'విస్తరణ'పై ప్రస్తుత ప్రణాళికల్ని పునఃసమీక్షించుకోవడం అవసరం. భారత వాయుసేన 44 స్వ్కాడ్రన్ ఫైటర్ ఫ్లీట్‌గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. 200 యుద్ధ ఓడలను సమకూర్చుకోవాలనుకుంటోంది నావికా దళం. ప్రస్తుత పరిస్థితుల్లో వీటిపై పునరాలోచించుకోవడమే ఉత్తమం.
ఇది భారత్ ఎదుర్కొంటున్న సమస్య మాత్రమే కాదు. 1987లో 600గా ఉన్న యుద్ధ ఓడలను.. 300కు తగ్గించుకుంది అమెరికా. వైమానిక దళంలో కూడా 70 యాక్టివ్ డ్యూటీ పైటర్ స్వ్కాడ్రన్లను 32కు కుదించుకుంది.
ఒకే ఒరలో రెండు కత్తులు...
అయితే రక్షణ బలగాల సంఖ్యను కుదిస్తే... సైనిక బలహీనతకు దారితీయొచ్చన్న వాదనలు వినిపిస్తాయి. అయితే.. ప్రతిసారీ అలా జరుగుతుందని చెప్పలేం. కాలం చెల్లిన ఆయుధ వ్యవస్థలతో కూడిన పెద్దదాని కంటే... బాగా అమర్చిన, అత్యాధునిక వ్యవస్థలే సమర్థమంతమైనవి.
ఉదాహరణకు 2015 నుంచి... చైనా తన సైనిక బలగాల్ని 3 లక్షలకు తగ్గించినా ఏ మాత్రం బలహీనం కాలేదు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(చైనా సైనిక దళం) తన యుద్ధ సంసిద్ధతను మరెంతో మెరుగుపర్చుకుంది కూడా.
రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్.. సైనిక దళాల్లో నిరాశను కలిగించొచ్చు. అయితే.. ఇప్పటికీ దీని పునర్నిర్మాణం, సంస్కరణల దిశగా ఆలోచించాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉంది. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్లు మొత్తం రక్షణ బడ్జెట్, సైన్యం పరిమాణం ఎక్కువ కాలం కలిసి ఉండలేవు.
- (రచయిత - డీఎస్ హుడా, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్)