తూర్పు లద్దాఖ్‌లో సైనిక ఉద్రిక్తతలు క్రమంగా చల్లారుతున్నాయి. 2 నెలల పాటు తీవ్ర ప్రతిష్టంభనకు కేంద్ర బిందువులుగా ఉన్న హాట్ స్ప్రింగ్స్, గోగ్రా ప్రాంతాల నుంచి భారత్, చైనాల బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి. ఈ ఉపసంహరణను సోమవారం ప్రారంభించిన డ్రాగన్.. మంగళవారమూ కొనసాగించింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీల మధ్య చర్చల అనంతరం తూర్పు లద్దాఖ్‌లో ఇరు దేశాలూ బలగాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించాయి.
ఆ ప్రాంతంలో చైనా ఉపసంహరణలను భారత్ నిశితంగా గమనిస్తోంది. అదే సమయంలో.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి వీలుగా అత్యున్నత స్థాయిలో అప్రమత్తతను కొనసాగిస్తోంది. గత నెల 30న జరిగిన రెండు దేశాల కోర్ కమాండర్ల చర్చల్లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అనేక ప్రాంతాల్లో ఇరుపక్షాల మధ్య 3 కిలోమీటర్ల మేర 'బఫర్ జోన్' (నిస్సైనిక ప్రాంతం)ను ఏర్పాటు చేస్తున్నారు.
ఉపసంహరణ తీరు ఇదీ..
- గల్వాన్‌లో చైనా తన సైన్యాన్ని రెండు కిలోమీటర్ల మేర వెనక్కి రప్పించింది. అక్కడి పెట్రోలింగ్ పాయింట్-14 వద్ద తన శిబిరాలను తొలగించింది.
- 8 వారాలుగా తీవ్రస్థాయి ఉద్రిక్తతలకు హాట్ స్ప్రింగ్స్, గోగ్రా ప్రాంతాలూ నెలవుగా ఉన్నాయి. అక్కడ ఇరు దేశాలు రెండు రోజుల్లో సైనిక ఉపసంహరణను పూర్తి చేసే అవకాశం ఉంది. హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో డ్రాగన్ బలగాలు రెండు కిలోమీటర్ల మేర వెనక్కి తగ్గుతాయి.
- హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, గల్వాన్ ప్రాంతాల్లో భారత్ కూడా కొంత దూరం వెనక్కి మళ్లింది. దీంతో ఇరు దేశాల సైనికుల మధ్య 'బఫర్ జోన్' ఏర్పడింది.
- పాంగాంగ్ సరస్సు వద్ద బలగాలను చైనా పెద్దగా ఉపసంహరించుకోలేదు. భారత సైన్యం గస్తీ తిరిగే ప్రాంతాల్లో చైనా దాదాపు 190 నిర్మాణాలను చేపట్టింది. కొద్దిరోజుల్లో ఇరు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలుజరిగే నాటికి చైనా ఇక్కడ వెనక్కి తగ్గుతుందని ఆశిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
స్వీయ బాగోతాన్ని బయటపెట్టుకున్న చైనా టీవీ
గల్వాన్‌లో తమ సైనికుల చట్టబద్ధ కార్యకలాపాలను రెండు నెలలుగా చైనా అడ్డుకుంటోందని భారత్ చేస్తున్న ఆరోపణలను రుజువు చేసేలా చైనా అధికారిక టీవీ (సీసీటీవీ) సోమవారం రాత్రి కొన్ని ఉపగ్రహ చిత్రాలను ప్రసారం చేసింది. ఆ చిత్రాల్లో పెట్రోలింగ్ పాయింట్-14 వద్ద భారత హెలిప్యాడ్, సైనిక శిబిరాలు కనిపించాయి. అవి ఎప్పటివన్నది వెల్లడించలేదు. అయితే భారత సైనికుల ఉనికి బాగా ఎక్కువగా ఉంది. మే 22న భారత మీడియాలో వచ్చిన ఉపగ్రహ చిత్రాల్లో భారత బలగాల కార్యకలాపాలేవీ లేవు. ఇగ్లూ ఆకారంలో ఉన్న నిర్మాణం ఒక్కటే కనిపించింది. ఇతర శిబిరాలేవీ లేవు. దీన్నిబట్టి మన భూభాగాన్ని ఆక్రమించిన చైనా సైనికులు అక్కడి నిర్మాణాలను తొలగించారని స్పష్టమవుతోంది.
ఇదీ చూడండి: ముంబయిలోని అంబేడ్కర్ నివాసంపై దుండగుల దాడి