దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 12వేల మందికిపైగా ఈ వైరస్ బారినపడ్డారు. పరీక్ష చేసిన వెంటనే ఫలితాలు వచ్చే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో వైరస్ను వేగంగా నిర్ధరించే పరికరంపై బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) పరిశోధనలు చేపట్టింది. శ్వాస, దగ్గు, మాటల శబ్దంతో వైరస్ నిర్ధరించే పరికరంపై పరిశోధన చేస్తున్నట్లు వెల్లడించారు పరిశోధకులు.
కోస్వర..
ఈ పరికరం రూపొందించటంలో ఎనిమిది మంది సభ్యులతో కూడిన బృందం పాలుపంచుకుంటోంది. ఈ ప్రాజెక్టుకు 'కోస్వర' అని పేరు పెట్టింది. ధ్వని తరంగాల ఆధారంగా వ్యాధి లక్షణాలను గుర్తించటమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టారు. సిగ్నల్ ప్రాసెసింగ్, మెషీన్ లెర్నింగ్ పద్ధతులను ఉపయోగించి వ్యాధిని గుర్తించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు పరిశోధకులు. ఈ సాధన విజయవంతమైతే కరోనా చికిత్స అందించే వైద్యులు వైరస్ బారిన పడే సమస్య తగ్గుతుందని.. ప్రస్తుతం ఉన్న పరీక్ష కిట్ల కంటే వేగంగా ఫలితాలిస్తుందని వెల్లడించారు. అయితే.. రసాయనికంగా చేపట్టే ప్రయోగాలకు ఇది ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు.
"కొవిడ్-19 వ్యాధి ప్రధాన లక్షణాల్లో శ్వాసకోశ సమస్య ఒకటి. మాటల ధ్వని తరంగాల ఆధారంగా వ్యాధి లక్షణాలను గుర్తించడం, లెక్కించడం ప్రతిపాదిత ప్రాజెక్టు లక్ష్యం. ఇందులో పాల్గొనేవారి శ్వాస, దగ్గు, మాటల ఉచ్ఛరణ శబ్దాలు లెక్కింపు చేయాల్సి ఉంటుంది. మొత్తం ప్రక్రియకు ఐదు నిమిషాల సమయం పడుతుంది."
-బెంగళూరు ఐఐఎస్సీ పరిశోధకుల బృందం
ఇదీ చూడండి: చైనా నుంచి భారత్కు 6.5 లక్షల కరోనా టెస్టింగ్ కిట్లు