బెంగళూరులోని ఎక్వైన్ బయోటెక్ స్టార్టప్ దేశీయంగా ఆర్టీ-పీసీఆర్ కరోనా కిట్‌ను అభివృద్ధి చేసింది. దీనికి భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) ఆమోదం కూడా లభించింది. 'గ్లోబల్ టీఎం డయాగ్నోస్టిక్ కిట్' పేరిట తయారు చేసిన ఈ కిట్‌ను.. తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ తెలిపింది.
ఈ పరికరం ద్వారా కొవిడ్ నమూనాను పరీక్షించి ఫలితాలు వెల్లడించేందుకు 1.5 గంటల సమయం పడుతుందని ఎక్వైన్ బయోటెక్ వ్యవస్థాపకుడు ఉత్పాల్ తాటు వెల్లడించారు. బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు ఉత్పాల్.
"కరోనా వైరస్ పరీక్షలపై చాలా ఏళ్ల నుంచి మేం పరిశోధన చేస్తున్నాం. కొవిడ్-19 ప్రారంభం కావడానికి ముందు నుంచే ఈ ప్రయోగాలు చేస్తున్నాం. ఈ అనుభవమే కొవిడ్ టెస్ట్ కిట్ రూపొందించడంలో సహాయపడింది."
-ఉత్పాల్ తాటు, ఎక్వైన్ బయోటెక్ వ్యవస్థాపకుడు
మహమ్మారి సమయంలో లాభాలు ఆర్జించడం ప్రధానం కాదని అన్నారు ఉత్పాల్. శాస్త్రీయ, పారిశ్రామిక రంగాలు కలిసి కొవిడ్‌పై సంయుక్తంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
సాధారణంగా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆర్టీ-పీసీఆర్ కిట్లతో పోలిస్తే.. ఇది వేగంగా ఫలితాలు అందిస్తోందని సంస్థ తెలిపింది. ఈ కిట్ ఉత్పత్తికి లైసెన్సుల కోసం దరఖాస్తు చేస్తోంది. భారీ ఎత్తున తయారు చేసి పంపిణీ చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి- 'వ్యాక్సిన్ కోసం భారత్ రూ.80వేల కోట్లు ఖర్చుచేయగలదా?'