దేశంలోనే కరోనా మహమ్మారి కేసుల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది తమిళనాడు. నీలగిరి జిల్లాలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా ఊటి, పరిసర ప్రాంతాల్లో వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. అక్కడ ప్రభుత్వాస్పత్రుల్లో వసతుల కొరతతో నగరంలోని లారెన్స్ పాఠశాలలో కొవిడ్ శిబిరం ఏర్పాటు చేసి.. 50 మంది రోగులకు చికిత్స అందిస్తున్నారు.
అయితే.. వైద్య సిబ్బంది ఉపయోగించిన పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులను నిర్లక్ష్యంగా బహిరంగ ప్రదేశాల్లో పారవేస్తున్నారు. ఇలాంటి సంఘటనలపై ఇటీవల ఫిర్యాదులు పెరిగాయి. అధికారుల తీరుపైనా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీపీఈ కిట్లు, ఔషధాల డబ్బాలు, సిరంజీలను బహిరంగ ప్రదేశాల్లో పారవేసినప్పుడు.. వాటిని కోతుల గుంపు నోట కరుచుకుని తీసుకెళ్లే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీని ద్వారా కోతులు వైరస్ బారినపడటమే కాదు.. మరింత మందికి మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం అధికంగా ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరో సంఘటన
కోయంబత్తూర్ జిల్లాలోని కొడిసియా ఎగ్జిబిషన్ కాంప్లెక్స్ ముందు ఈనెల 10న ఓ శునకం.. పీపీఈ కిట్టును నోటకరుచుకొని లాక్కెళ్లటం స్థానికుల్లో ఆందోళన కలిగించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారటం వల్ల.. భారీగా విమర్శలు వెల్లువెత్తాయి.
ఇదీ చూడండి:'కార్గిల్ వీరుల శౌర్యం.. భావితరాలకు స్ఫూర్తిదాయకం'