దేశ రాజధానిలో అల్లర్లు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో కేంద్రం హోంశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. దిల్లీలో పరిస్థితిని బట్టి పారామిలిటరీ దళాల సంఖ్య పెంచాలని తీర్మానించినట్లు సమాచారం.
నిన్నటివరకు పలు ప్రాంతాల్లో 37 కంపెనీల పారామిలిటరీ దళాలను మోహరించారు. హస్తినలో ప్రస్తుతం 45 కంపెనీలు పారామిలిటరీ బలగాలు ఉన్నాయి. భద్రతా సిబ్బందిని మరింత పెంచాలని హోంశాఖ నిర్ణయించినట్లు తెలిసింది.
దిల్లీ పోలీసులతో కలిసి..
దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న బలగాలను పూర్తిగా శాంతి భద్రతల పరిరక్షణకు వినియోగించుకోవాలని హోంశాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దిల్లీ పోలీసులతో సమన్వయపరుచుకుంటూ శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది.
మొత్తం వ్యవహారాన్ని హోం శాఖ స్వయంగా పర్యవేక్షించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఐరాస పరిశీలన
దిల్లీలో జరుగుతున్న అల్లర్లను ఐక్యరాజ్య సమితి ప్రధాని కార్యదర్శి అంటోనియో గుటేరస్ సునిశితంగా పరిశీలిస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. నిరసనకారులు శాంతియుతంగా ఆందోళన చేపట్టాలని కోరుతున్నట్లు ఐరాస అధికార ప్రతినిధి తెలిపారు.
20 మంది మృతి..
ఈశాన్య దిల్లీలో పౌరసత్వ చట్టంపై జరిగిన ఆందోళనల్లో భారీ హింస చెలరేగింది. సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణలతో దిల్లీ వీధుల్లో విధ్వంసం జరిగింది. 20 మంది మరణించగా.. 200 మందికిపైగా క్షతగాత్రులయ్యారు.
ఇదీ చూడండి: దిల్లీ అల్లర్లు: 20కి చేరిన మృతులు.. కేజ్రీవాల్ ఆందోళన