దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి బాధ్యతా రాహిత్య వ్యక్తులే కారణమని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ పేర్కొన్నారు. వీరు యువకులా, వృద్ధులా అన్నది చెప్పలేం గానీ... 'మాకేం కాదులే' అన్న నిర్లక్ష్యంతో మాస్క్ ధరించకుండా, దూరం పాటించకుండా తిరిగేవారే వైరస్ వ్యాప్తికి కారణమని స్పష్టంగా చెప్పగలమన్నారు. "కొందరు కొవిడ్‌కు భయపడాల్సిన అవసరం లేదని భావిస్తుంటే... మరికొందరు చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. జాగ్రత్తలు పాటించిన వారిలోనూ కేసులు వచ్చి ఉండొచ్చు. కానీ వైరస్ వ్యాప్తికి మాత్రం నిర్లక్ష్యం వ్యవహరించే వ్యక్తులే కారణం" బలరాం భార్గవ అన్నారు.
ఎక్కువ పరీక్షలు చేయగలుగుతున్నాం
"దేశీయంగా ఆర్టీ-పీసీఆర్ టెస్టింగ్ కిట్లను అభివృద్ధి చేయడం వల్ల... ఒకప్పుడు రూ.2 వేలున్న కిట్ ఇప్పుడు రూ.310కి పడిపోయింది. దీంతో ఎక్కువ పరీక్షలు చేయగలుగుతున్నాం. ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్లు క్లినికల్ పరీక్షల దశలో, మరో మూడు ప్రీ-క్లినికల్ దశలో ఉన్నాయి. సీరం ఇన్‌స్టిట్యూట్ వ్యాక్సిన్‌ను మూడో దశలో భాగంగా 1,700 మందిపై ప్రయోగించనున్నారు. భారత్ బయోటెక్ తొలిదశలో 375 మందిపై వ్యాక్సిన్‌ను ప్రయోగించి, రెండో దశకు వెళ్తోంది. జైదూస్ క్యాడిలా టీకా తొలిదశలో 45-50 మందిపై ప్రయోగాలు పూర్తిచేసింది. రెండో దశ మొదలుకావాల్సి ఉంది" అని బలరాం భార్గవ వివరించారు.