ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ప్రధాన కార్యనిర్వహణాధికారి చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం విచారించింది. సుమారు 8 గంటల పాటు వారిపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. అక్రమ నగదు బదిలీ నివారణ చట్టం (పీఎమ్ఎల్ఏ) కింద వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. మంగళవారమూ విచారణ కొనసాగే అవకాశముంది.
కేసు విచారణలో భాగంగా ఈ నెల మొదటి వారంలోనే హాజరు కావాలని ఈడీ ఆదేశించినప్పటికీ.. కొంత సమయం కావాలని వారు కోరారు. కొచ్చర్ దంపతుల వినతిని అంగీకరించిన ఈడీ... సోమవారం విచారణ జరిపింది.
ఈ కేసుకు సంబంధించి కొద్ది రోజుల ముందే చందా కొచ్చర్ మరిది, సింగపూర్ ఆధారిత అవిస్టా అడ్వైజరీ సంస్థ వ్యవస్థాపకుడు రాజీవ్ కొచ్చర్‌ను ఈడీ ప్రశ్నించింది.
మార్చి 1న సోదాలు
మార్చి 1న కొచ్చర్, వీడియోకాన్ ప్రతినిధి వేణుగోపాల్ నివాసాలు సహా ముంబయి, ఔరంగాబాద్‌లోని కార్యాలయాల్లో సోదాలు జరిపింది ఈడీ. అనంతరం వీడియోకాన్‌కు అక్రమ మార్గంలో రూ.1875 కోట్ల రుణాన్ని మంజూరు చేశారని ఆరోపిస్తూ చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వేణుగోపాల్‌పై కేసు నమోదు చేసింది.