రెండో విడతలో భారత్‌కు రావాల్సిన రఫేల్ యుద్ధ విమానాలను తీసుకుని రావడానికి భారత వాయుసేనకు చెందిన పైలట్ల బృందం ఫ్రాన్స్ వెళ్లినట్లు అధికారులు తెలిపారు. అధునాతన సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్న ఈ యుద్ధ విమానాలకు సంబంధించి పూర్తి శిక్షణను సెయింట్-డైజర్లోని ఎయిర్ బేస్‌లో ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కేవలం నెల రోజుల్లో నాలుగు రఫేల్ విమానాలు దేశానికి రానున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా అయిదు విమానాలు సెప్టెంబర్ 10న వాయుసేనలో వచ్చి చేరాయి.
నాలుగేళ్ల క్రితమే ఒప్పందం..
రఫేల్ యుద్ధవిమానాలు కొనుగోలు చేసేందుకు భారత్ నాలుగేళ్ల కిందట ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకుంది. మొత్తం 36 రఫేల్ విమానాలకు గాను సుమారు రూ.59 వేల కోట్లు వెచ్చించనుంది. అధునాతన వ్యవస్థతో యుద్ధసామగ్రిని మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న వీటి శిక్షణకు, ప్రాజెక్టు పురోగతిని పర్యవేక్షించడానికి జనవరి నుంచి ఐఏఎఫ్ బృందాలు ఫ్రాన్స్‌కు వెళ్లి వచ్చాయి.
మరో ఐదు ఫ్రాన్స్‌లోనే...
ఫ్రాస్స్ అందజేసిన పది రఫేల్ విమానాల్లో ఐదు ఫ్రాన్స్‌లోనే ఉంచారు. వీటిని సిబ్బంది శిక్షణకు ఉపయోగిస్తున్నారు. రఫేల్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ బృందానికి పారిస్‌లో కెప్టెన్-ర్యాంక్ అధికారి నేతృత్వంలో ఓ కార్యాలయం ఉంది. ఈ కార్యాలయం రఫేల్ ఉత్పత్తి, సిబ్బంది శిక్షణను పర్యవేక్షిస్తోంది. మొత్తం 36 రఫేల్ జెట్లు 2023 నాటికి వాయుసేనకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా ఇప్పటికే స్పష్టం చేశారు.
తూర్పు లద్దాఖ్‌లో కొత్తగా ప్రవేశించిన ఐదు రఫేల్ యుద్ధ విమానాలు భారత్-చైనా సరిహద్దులో చక్కర్లు కొడుతున్నాయి.