సమాజానికి స్ఫూర్తినిచ్చే మహిళలకు తన సామాజిక మాధ్యమ ఖాతాలను అప్పగించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. స్ఫూర్తినిచ్చే అలాంటి మహిళల కథలను తనతో పంచుకోవాలని ప్రజలను కోరారు.
"ఈ మహిళా దినోత్సవం (మార్చి 8) నాడు, నేను నా సోషల్ మీడియా ఖాతాలను... తమ సేవా దృక్పథంతో మనకు స్ఫూర్తినిచ్చే మహిళలకు అప్పగిస్తాను. ఇది ఆ మహిళా మూర్తులకు... లక్షలాది ప్రజల్లో ప్రేరణ కలిగించడానికి సహాయపడుతుంది.
మీకు అలాంటి స్ఫూర్తినిచ్చే మగువ లేదా మహిళలు గురించి తెలుసా? #షిఇన్స్పైర్స్యూ హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి అలాంటి కథలను పంచుకోండి."
- ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్
ప్రధాని మోదీ తాజా ట్వీట్ గంటలోనే సుమారు 26,000 సార్లు రీట్వీట్ అవ్వడం గమనార్హం.
ఊహాగానాలకు ఫుల్స్టాప్!
మోదీ సోమవారం తన సామాజిక మాధ్యమ ఖాతాలు (ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అకౌంట్లు) విడిచిపెట్టాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై రాజకీయ పక్షాల్లో, ప్రజల్లో పలు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ప్రధాని తాజా ట్వీట్ ఆ ఊహాగానాలకు ముగింపు పలుకుతుందని భావిస్తున్నారు.
ఇదీ చూడండి: దిల్లీలో బయటపడ్డ నకిలీ జీఎస్టీ బిల్లుల రాకెట్