మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సన్నిహితులపై ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. పన్ను ఎగవేత ఆరోపణల కారణంగా దిల్లీ, మధ్యప్రదేశ్‌లలో కమల్‌నాథ్ సంబంధీకుల ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇండోర్, భోపాల్, దిల్లీలో తనిఖీలు చేశారు ఆదాయపన్ను అధికారులు. మొత్తం 50 ప్రదేశాల్లో 300 మంది సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు.
మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ మాజీ ప్రత్యేక అధికారి ప్రవీణ్ కక్కర్, మాజీ సలహాదారు రాజేంద్ర మిగ్లానీ ఆయన బంధువు రతుల్ పూరి సహా మరి కొంతమంది నివాసాలపైనా ఐటీ శాఖ దాడులు చేసింది. స్వాధీనం చేసుకున్న పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
రతుల్ పూరిని గతవారం ఈడీ అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో విచారించింది.
లోక్‌సభ ఎన్నికల ప్రకటన రాగానే కక్కర్, మిగ్లానీ వారి ఉద్యోగాలకు రాజీనామా చేయడం గమనార్హం.
ఎవరీ ప్రవీణ్ కక్కర్..?
మధ్యప్రదేశ్‌కు చెందిన మాజీ పోలీసు అధికారి ప్రవీణ్ కక్కర్. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కక్కర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు. కేంద్ర మాజీ మంత్రి కాంతీలాల్ భూరియా దగ్గర ఈయన ప్రత్యేక అధికారిగా ఉన్నారు. ఎంతోమంది వ్యాపారులతో కక్కర్ కుటుంబానికి సంబంధాలున్నాయి.
మరోచోట...
కోల్‌కతాకు చెందిన వ్యాపారి పరాస్ మార్ లోథా నివాసాలపైనా 200 మంది ఐటీ అధికారులు ఉదయం 3 గంటల ప్రాంతంలో దాడులు చేశారు. ఎన్నికల వేళ భారీగా హవాలా డబ్బు తరలిస్తున్నారనే సమాచారంతో ఈ సోదాలు చేశారు. సరైన ఆధారాలు లేని సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
- ఇవీ చూడండి: 'వారివి తప్పుడు హామీలు- ఇవిగో సాక్ష్యాలు'