దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ను తప్పుబట్టారు కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ మేనకా గాంధీ. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం ఎవ్వరికీ లేదని అభిప్రాయపడ్డారు. నిందితులను ఎన్కౌంటర్ చేయడం అమానుషం అన్నారు. ఎవరికి నచ్చినట్టు వారు మనుషుల్ని చంపడం సబబు కాదని పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో అన్నారామె.
"ఇదేం బాగాలేదు. నేను ఎన్కౌంటర్లను పూర్తిగా వ్యతిరేకిస్తాను. దిశ నిందితులను చట్టపరంగా శిక్షించాల్సింది. ఎన్కౌంటర్ చాలా ప్రమాదకరమైన చర్య. అంత ఘోరానికి తెగబడ్డవారికి ఎలాగైనా ఉరి శిక్ష పడి ఉండేది కదా! కానీ... మీరు కావాలనుకున్నారు కాబట్టి.. మీకు మనుషుల్ని చంపే అధికారం లేదు.
నిర్భయ కేసు నిందితులకు శిక్ష పడలేదంటే.. అది చట్టంలోని లోపమే కానీ మనుషులది కాదు. చట్టం అమలు అయ్యేందుకు సమయం పడుతుంది. ఇప్పుడేదైతే అయ్యిందో
(ఎన్కౌంటర్) ... దేశంలోనే చాలా భయానక చర్య. ఎందుకంటే మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు. మీరు ముందే తుపాకీలతో కాల్చి చంపేస్తే.. కోర్టులు, పోలీసులు, చట్టాలు ఉండి ప్రయోజనం ఏంటి? తుపాకీతో ఎవరిని పడితే వారిని చంపడానికి ఇవన్నీ ఎందుకు?"
-మేనకా గాంధీ, భాజపా ఎంపీ
ఆలస్యమైందన్న జయ..
దిశ కేసు నిందితులను మూకదాడి ద్వారా చంపాలని ఇంతకుముందు పార్లమెంటులో బలంగా వాదించిన ఎస్పీ ఎంపీ జయా బచ్చన్.. ఎన్కౌంటర్పై స్పందించారు. "ఎన్కౌంటర్ చాలా ఆలస్యంగా జరిగింది. అయితే... అసలు శిక్ష పడకపోవడంకన్నా ఇదే మేలు" అని అన్నారు.
ఇది చదవండి:'చట్టం తన పని తాను చేసుకుపోతుంది'