తమిళనాడులో బ్యానర్లపై ఇటీవల నిషేధం విధించిన మద్రాసు హైకోర్టు స్వల్ప సడలింపు ఇచ్చింది. భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ తమిళనాడు పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో బ్యానర్ల ఏర్పాటుకు అనుమతినిచ్చింది.
తమిళనాడు మామళ్లపురంలో అక్టోబర్ 11-13 తేదీల్లో మోదీ, జిన్‌పింగ్ భేటీ కానున్నారు. ఈ సందర్భాన ఇరువురిని స్వాగతిస్తూ బ్యానర్లను ఏర్పాటు చేసేందుకు హైకోర్టు అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకు సమ్మతించిన హైకోర్టు.. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు పాటించాలని సూచించింది. అయితే.. ఇతర రాజకీయ పార్టీలు బ్యానర్లు వినియోగించరాదని ఆదేశించింది.
కమల్‌హాసన్ స్పందన..
మద్రాస్ హైకోర్టు తీర్పును తప్పుబట్టారు మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు కమల్‌హాసన్. 'బాధ్యత కలిగిన వ్యక్తిగా బ్యానర్ల సంస్కృతిని అంతం చేయాలంటూ' మోదీని విజ్ఞప్తి చేశారు కమల్.
కొన్ని రోజుల క్రితం ప్రైవేటు సంస్థకు చెందిన బ్యానర్ వల్ల ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మద్రాసు హైకోర్టు.. బ్యానర్లను నిషేదిస్తూ తీర్పునిచ్చింది.