దేశంలో 24 గంటల వ్యవధిలో 16,002 కరోనా పరీక్షలు జరిగాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో 2శాతం మాత్రమే పాజిటివ్ కేసులు ఉన్నాయని ఆ శాఖ సంయుక్త ప్రధాన కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దేశంలో సామాజిక విస్తరణ లేదని.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
146 ప్రభుత్వ, 67 ప్రైవేటు ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నట్టు వివరించారు లవ్ అగర్వాల్. రెండు నెలల్లో 49వేల వెంటిలేటర్ల కోసం ఆర్డర్లిచ్చినట్టు పేర్కొన్నారు.
తగినంత నిల్వలు..
హైడ్రాక్సీ క్లోరోక్విన్ కోసం వివిధ దేశాల నుంచి విజ్ఞప్తులు అందుతున్నట్టు ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి వెల్లడించారు. దేశంలో కోటి హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రల అవసరం ఉందని... కానీ మొత్తంగా 3.28కోట్ల మాత్రలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.
దేశంలో ఇప్పటివరకు 6,412మంది వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం 5709 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం 199మంది ప్రాణాలు కోల్పోయారు.