తబ్లీగీ జమాత్ సభ్యుల తీరు సర్వత్రా వివాదాస్పదమవుతోంది. దిల్లీ నిజాముద్దీన్‌లో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన వారి వల్ల దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అయినప్పటికీ దేశవ్యాప్తంగా జమాత్ సభ్యుల తీరులో ఏమాత్రం మారడం లేదు. పోలీసులు, వైద్యులకు సహకరించకుండా నానా గందరగోళం సృష్టిస్తున్నారు. పోలీసులపై తిరగబడి దాడులకు పాల్పడిన ఘటనలూ చోటుచేసుకుంటున్నాయి.
11మంది పరారీ
మహారాష్ట్రలోని పుణెలో 11మంది జమాత్ సభ్యులకు వైరస్ సోకిందని పోలీసులు అనుమానించారు. వారిని సమీప మసీదులోనే ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశించారు. కానీ వారు ఆ మసీదు నుంచి తప్పించుకుని పారిపోయారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే వీరు దిల్లీలో జరిగిన సమావేశానికి హాజరు కాలేదని స్పష్టం చేశారు. వీరి వల్ల ముప్పు ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు.
లాక్‌డౌన్‌కు ముందే..
దిల్లీ నిజాముద్దీన్ మర్కజ్లో పాల్గొన్న వారు ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాలకు చేరుకున్నారు. ప్రస్తుతం వారిని గుర్తించే పనిలో పడ్డాయి ఆయా రాష్ట్రాలు. తాజాగా హరియాణాలో 1300మంది తబ్లీగీ జమాత్ సభ్యులను గుర్తించారు అధికారులు. అయితే వీరందరూ లాక్‌డౌన్‌కు ముందే రాష్ట్రంలోకి ప్రవేశించినట్టు వివరించారు. మొత్తంగా 1305మంది ప్రవేశించగా.. వీరిలో 107 మంది విదేశీయులు ఉన్నట్లు వెల్లడించారు. అందులో 8 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు తెలిపారు.
వైద్యుల పట్ల దురుసుగా
మరోవైపు.. కరోనా బాధితులకు సాహసోపేతంగా చికిత్స అందిస్తోన్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పట్ల కొందరు దురుసుగా ప్రవర్తిడంపై ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్. వైద్యులపై దాడి జరిగితే.. రోగులకే నష్టమని, వారికి చికిత్స అందించడం ఆలస్యమవుతుందన్నారు. బుధవారం ఇండోర్‌లోని తాట్పత్తి బఖాల్లో ఓ కరోనా రోగి బంధువులకు వైద్య పరీక్షలు నిర్వహించడానికి వెళ్లిన ఐదుగురు వైద్యబృందంపై ఓ గుంపు రాళ్లతో దాడి చేసింది. ఆ నేపథ్యంలోనే హర్షవర్థన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చూడండి : మహారాష్ట్రపై కరోనా పంజా.. ఒక్క రోజులో ఆరుగురు బలి