పీజీ చదవాలనుకునే వైద్య విద్యార్థులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది కేంద్రం. వైద్య విద్య పీజీ ప్రవేశ పరీక్ష 'నీట్-పీజీ'ని తొలగించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతిపాదన చేసింది. ఎమ్డీ, ఎమ్ఎస్ ప్రవేశానికి ఎమ్‌బీబీఎస్ తుది పరీక్ష సరిపోతుందని పేర్కొంది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎమ్సీ) ముసాయిదా బిల్లుకు సవరణలు చేసింది. ఈ బిల్లును త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకురానుంది ఆరోగ్య శాఖ. ప్రధానమంత్రి కార్యాలయం సూచనల మేరకు బిల్లులో సవరణలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
నూతన ఎన్ఎమ్సీ బిల్లులో ప్రతిపాదించిన సవరణల ప్రకారం వైద్య విద్య పీజీలో చేరేందుకు దేశవ్యాప్తంగా నిర్వహించే నేషనల్ ఎక్జిట్ టెస్ట్ (నెక్ట్స్) పరీక్ష ఫలితాలు సరిపోతాయి. ఎమ్‌బీబీఎస్ తుది పరీక్ష రాసిన అనంతరం పీజీలో చేరేందుకు ప్రత్యేక పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదు. ఎమ్‌బీబీఎస్ అనంతరం ప్రాక్టీస్‌కు సైతం ప్రత్యేక పరీక్ష రాయాల్సిన అవసరమూ లేదు.
ఎయిమ్స్‌లో తప్పనిసరి
ఎయిమ్స్‌లో పీజీ చేయాలనుకుంటే మాత్రం ప్రత్యేక పరీక్ష తప్పని సరి. డీఎమ్, ఎమ్సీహెచ్ కోర్సుల్లో చేరేందుకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష 'నీట్-సూపర్‌స్పెషాలిటీ' రాయాల్సిందే.
ప్రతి ఏటా 1.5 లక్షల మంది..
దేశంలోని 480 వైద్య కళాశాలల్లో ఎమ్‌బీబీఎస్ కోర్సుల్లో ప్రతి ఏటా 80 వేల మంది విద్యార్థులు చేరుతున్నారు. 50 వేల పీజీ సీట్ల కోసం సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులు నీట్-పీజీ పరీక్ష రాస్తున్నారు.
2017లోనే లోక్‌సభ ముందుకు బిల్లు
ఎన్ఎమ్సీ బిల్లును 2017, డిసెంబర్లో లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది కేంద్రం. కానీ 16వ లోక్‌సభ రద్దుతో ఆ బిల్లు గడువు ముగిసింది.
ఇదీ చూడండి: కర్తార్పుర్పై రాజీ- భద్రతే ప్రధానంగా భారత్ వాణి