జేఎన్‌యూ ఘటనకు సంబంధించిన ఆధారాలను భద్రపరచాలని ధాఖలైన పిటిషన్‌పై స్పందిచాల్సిందిగా.. దిల్లీ ప్రభుత్వం, పోలీసులు సహా వాట్సాప్, గూగుల్, యాపిల్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది దిల్లీ హైకోర్టు. ఈ అంశంపై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు జస్టిస్ బ్రిజేశ్ సేతి.
ఈ నెల 5న జరిగిన జేఎన్‌యూ ఘటనకు సంబంధించి ప్రొఫెసర్లు అమీత్ పరమేశ్వరన్, అతుల్ సూద్, శుక్లా వినాయక్ సావంత్ ఈ పిటిషన్ వేశారు. ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా దిల్లీ ప్రభుత్వానికి, పోలీస్ కమీషన్లకు సూచించాలని కోరారు. ఈ పిటిషన్లో జేఎన్‌యూ క్యాంపస్‌లోని అన్నీ సీసీటీవీ దృశ్యాలను భద్రపరచాలని పేర్కొన్నారు.
ఈ అంశమై.. జేఎన్‌యూ అధికారులను వర్సిటిలోని అన్ని సీసీటీవీ దృశ్యాలు సేకరించి, అప్పగించాల్సిందిగా కోరినట్టు దిల్లీ పోలీసులు హైకోర్టుకు తెలిపారు. అయితే, ఇప్పటివరకు వర్సిటీ నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు.
విశ్వవిద్యాలయంలోని 'యునిటీ ఎగెయిన్స్ట్ లెఫ్ట్', 'ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్' అనే రెండు బృందాలకు సంబంధించిన డేటాను భద్రపరచాలని వాట్సాప్‌ను కోరినట్లు.. దిల్లీ ప్రభుత్వం స్టాండింగ్ కౌన్సిల్ తెలిపింది. సందేశాలు, వీడియోలు, ఫోన్ నంబర్లతో సహా అన్ని వివరాలు సేకరిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఇదీ జరిగింది
జనవరి 5వ తేదీ రాత్రి కొందరు ఆగంతుకులు వర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, అధ్యాపకులపై విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. ముసుగులు ధరించి కర్రలు, ఇనుప రాడ్లు వంటివాటితో విరుచుకుపడ్డారు. వసతి గృహాల్లోని అద్దాలు, ఫర్నీచర్, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ఈ దాడిలో విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షురాలు అయిషీ ఘోష్ సహా పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దాడికి పాల్పడింది మీరంటే మీరంటూ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ), అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి.
ఇదీ చదవండి:40వేల కిమీ.. 1500 అమర జవాన్ల కుటుంబాలు.. ఓ బాలుడు