మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ.. అహింసా సిద్ధాంతంతో భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని విజయతీరాలకు చేర్చిన మహనీయుడు.
సాధారణ పౌరులకు లేని విశిష్ట గుణగణాలు గాంధీ సొంతం. ఎంతో మందిని పరివర్తన మార్గంలోకి నడిపించారాయన.
గాంధీజీ సిద్ధాంతాలు, ప్రబోధాలు ఇప్పటికీ వర్తిస్తాయి. అందుకే ఆయనకు జనాకర్షణ ఎక్కువని చెబుతారు సుందర్‌లాల్ బహుగుణ.
బహుగుణ ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమ సారథి. పర్యావరణ హితం కోసం ఆయన చేసిన అవిరళ కృషికి పద్మవిభూషణ్‌తో సత్కరించింది భారత ప్రభుత్వం.
మహాత్ముడి 150వ జయంత్యుత్సవాల్లో భాగంగా.. గాంధీ సిద్ధాంతాల కోసం జీవితాన్ని అంకితమిచ్చిన బహుగుణతో ఈటీవీ భారత్ ముచ్చటించింది.
"స్వతంత్ర భారతం కోసం గాంధీ కన్న కలలను మనం సాకారం చేయలేకపోయాం. దేశం గ్రామీణ జీవనశైలిపై ఆధారపడాలని ఆయన నమ్మారు. సమాజానికి గ్రామాలే మూలం కావాలని ఆశించారు. ఎలాంటి వ్యసనాలు లేని భారత్ కావాలని ఆకాంక్షించారు. కానీ ఇప్పుడు మత్తు పదార్థాలు, మద్యాన్ని మనం వ్యాపారం చేశాం. గాంధీజీ గడిపిన సన్యాసి జీవితాన్నే ఆయన నమ్మారు. ప్రచారం చేశారు."
-సుందర్ లాల్ బహుగుణ, పర్యావరణ వేత్త
ప్ర. మీరు యుక్త వయసులో ఉన్నప్పుడు గాంధీజీ, ఆయన సిద్ధాంతాలపై ఎలాంటి అభిప్రాయం ఉండేది?
జ: ఉజ్వల భవిష్యత్తు దిశగా భారత్‌ను నడిపించేందుకు గాంధీజీ చూపిన మార్గాన్ని మేం నమ్మాం. అందుకే ఆయన్ను జాతిపితగా పిలుచుకున్నాం. గాంధీజీ మరణించే ముందు రోజు ఆయనను నేను కలిశాను. హిమాలయ ప్రాంతంలో స్వయం పరిపాలన ప్రారంభించామని చెప్పాను. అప్పుడు గాంధీ చెప్పిన మాట నాపై ఎంతో ప్రభావాన్ని చూపింది. "మంచిది! మీరు చేసిన కృషి విలువ.. మీరు నివసించే పర్వతాల ఎత్తుతో సమానం" అని అన్నారు.
ప్ర. మీరు ఎన్నో నిరసనల్లో భాగమయ్యారు. ఆ సమయంలో గాంధీ నిర్వహించే నిరసనలు, సభల్లో యువతకు అవకాశమిచ్చేవారా?
జ: నువ్వు పుట్టినప్పుడు ఖైదీవే కానీ... చావులో మాత్రం స్వేచ్ఛగా ఉండాలని గాంధీ చెబుతుండేవారు. స్వాభిమానం, గౌరవానికి సంబంధించి ఎప్పుడూ మాట్లాడేవారు. అవి ఇప్పుడు అరుదుగా కనిపిస్తాయి.
ప్ర. ప్రస్తుత తరంపై మీ అభిప్రాయం? ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు?
జ: మనం దేశం ప్రస్తుతం రుణగ్రహీతగా మారింది. అభివృద్ధి, విస్తరణ పేరుతో విదేశాల నుంచి అప్పులు తెచ్చుకుంటున్నాం. భారత్ స్వయం ఆధారిత దేశంగా ఉండాలని గాంధీజీ కోరుకున్నారు. ఈ విషయంలో మార్పు రావాలి.
ప్ర. గాంధీజీ సిద్ధాంతాలకు మిమ్మల్ని ఏ అంశం దగ్గర చేసింది? వాటిని ఈ రోజుల్లో ఆచరించటం సాధ్యమేనా?
జ: ప్రజలు స్వయం సమృద్ధిగా ఎదిగేలా గాంధీజీ స్ఫూర్తినిచ్చారు. నిరాడంబర జీవితం గడపాలని కోరుకున్నారు. ఓపిక, దయ కలిగి ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి:గాంధీ కోసం... అబలలు ఆభరణాలు ఇచ్చేశారట!