మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370, 35A రద్దు చేసిన సందర్భంగా భాజపా శ్రేణుల్లో హుషారు పెరిగింది. ఆర్టికల్ 370 రద్దును పురస్కరించుకుని హరియాణాలోని ఫతేబాద్ జిల్లాలో జరిగిన సభలో 'ఇక కశ్మీర్ నుంచి వధువులను తెచ్చుకోవచ్చు' అంటూ హిమాచల్‌ప్రదేశ్ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ చేసిన ప్రసంగం దుమారం రేపింది.
"అబ్బాయిల సంఖ్య కన్నా అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంటే సమస్యలు వస్తాయి. బిహార్ నుంచి వధువులను తెచ్చుకోవచ్చని అప్పట్లో మా ధన్కర్ చెప్పారు. కశ్మీర్ నుంచి వధువులను తెచ్చుకోచ్చని ఇప్పుడు కొందరు అంటున్నారు. లింగ నిష్పత్తి సరిగ్గా ఉంటేనే.. సమాజంలో సమానత్వం ఉంటుంది."
- మనోహర్ లాల్ ఖట్టర్, హరియాణా ముఖ్యమంత్రి.
హరియాణాలో వధువులు లభించకపోతే... రాష్ట్ర యువత కోసం బిహార్ నుంచి తెప్పిస్తానని హరియాణా మంత్రి ఓపీ ధన్కర్ 2014లో అన్నారు.
మహిళ కమిషన్ తీవ్ర ఆగ్రహం..
ఖట్టర్ వ్యాఖ్యలపై జాతీయ, దిల్లీ మహిళా కమిషన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఖట్టర్ వ్యాఖ్యలు రాష్ట్రం మొత్తాన్ని కించపరిచేలా ఉన్నాయని.. అవి హింసకు దారి తీస్తాయని పేర్కొన్నాయి.
ఈ వ్యాఖ్యలు చేసినవారిపై సెప్టెంబర్ 14లోగా చర్యలు తీసుకోవాలని దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులను దిల్లీ మహిళ కమిషన్ డిమాండ్ చేసింది.
తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ ప్రతినిధి డిమాండ్ చేశారు.
ఖట్టర్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం..
ఖట్టర్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. ముఖ్యమంత్రి పదవి నుంచి ఖట్టర్‌ను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ విషయంపై స్పందించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.
"ఖట్టర్ చేసిన వ్యాఖ్యలు గర్హనీయమైనవని. పురుషులు సొంతం చేసుకోవడానికి మహిళలేమీ ఆస్తులు కాదు. ఓ బలహీన వ్యక్తికి ఎన్నో ఏళ్లు ఆర్ఎస్ఎస్ శిక్షణ పొందితే ఇలాగే ఉంటుంది."
---రాహుల్ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు
విమర్శలపై స్పందించిన ఖట్టర్
ఆర్టికల్ 370ని ఉద్దేశించి చేసిన వాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో ఖట్టర్ స్పందించారు. రాహుల్ గాంధీపై ఖట్టర్ మండిపడ్డారు. నిరాధార వార్తలకు రాహుల్ విమర్శించడం సరికాదన్నారు.
"మీ హోదాకు ఇలాంటి నిరాధార వార్తలపై స్పందించడం సరికాదు. నేను ప్రసంగించిన వీడియోను పంపుతున్నా. ఏ సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నానో అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఆడపిల్లలు దేశానికే గర్వకారణం. దేశంలోని ప్రతి ఆడబిడ్డ మా కూతురు లాంటిది."
---ఖట్టర్,హరియాణా ముఖ్యమంత్రి.
ప్రతి 1000 మందికి 850మంది ఆడపిల్లలు ఉండేవారని, బేటి బచావ్ బేటి పడావ్ వంటి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత ఆడపిల్లల సంఖ్య 850 నుంచి 933కి చేరిందని అన్నారు.
ఇదీ చూడండి: లైవ్: కాంగ్రెస్ కొత్త సారథిపై కాసేపట్లో స్పష్టత!