'చౌకీదార్ చోర్ హై '( కాపలదారే దొంగ) అని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలను ఇరుకునపెట్టేందుకు... దేశాభివృద్ధికి పాటుపడుతున్న ప్రతీ భారతీయుడూ చౌకీదారేనని ప్రధాని మోదీ అన్నారు. ట్విట్టర్లో మై బీ చౌకీదార్ హూ( నేనూ కాపలదారుడినే) ఉద్యమానికి పిలుపునిచ్చారు. 'చౌకీదార్' ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రులు, భాజపా ముఖ్యమంత్రులు, పార్టీ నేతలు, అభిమానులు వారి ట్విట్టర్ ఖాతాలకు చౌకీదార్ పదాన్ని జోడిస్తున్నారు.
ట్రెండింగ్లో..
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమ ట్విట్టర్ ఖాతాలకు బేరోజ్గార్ పదాన్ని జోడించుకుంటున్నారనిగుజరాత్ కాంగ్రెస్ ఐటీ విభాగం ఉపాధ్యక్షుడు హిరెన్ బంకెర్ తెలిపారు. బేరోజ్గార్ పదాన్ని కొంత మంది యువకులు తమ ట్విట్టర్ ఖాతాలకు జోడించారు. ఆదివారం నుంచి ఈ పదం ట్రెండింగ్లో ఉంది.
బేరోజ్గార్ పదాన్ని ఇంకా అధికారికంగా కాంగ్రెస్ స్వీకరించలేదని హిరెన్ బంకెర్ తెలిపారు. ఈ అంశంపై పార్టీ అగ్రనేతలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఆరోపణలు
రఫేల్ ఒప్పందం అవినీతిలో కాపలాదారే దొంగ అంటూ ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అనేకసార్లు ఆరోపణలు చేశారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు చేస్తూనే ఉన్నారు.