ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల ఖాతాల వ్యవహారంపై కాంగ్రెస్ సలహా ఇచ్చింది. మోదీ.. తన ఖాతాలను ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి ఇవ్వాలని కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితా దేవ్ సూచించారు. తన కథ చెప్పుకునే అర్హత.. ఉన్నావ్ బాధితురాలికి ఉందన్నారు.
"మోదీజీ. ఒక సలహా. ఉన్నావ్ బాధితురాలికి మీ ఖాతాను ఇవ్వండి. మీ పార్టీకి చెందిన అనేక మంది నేతలు చేసిన దాడులను ఆమె జయించింది. ఆమె ఎంతో ధైర్యవంతురాలు. తన కథ చెప్పుకునే అర్హత తనకు ఉంది."
-- సుస్మితా దేవ్, కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు.
సామాజిక మాధ్యమాల నుంచి తప్పుకోనున్నట్టు సోమవారం ట్వీట్ చేశారు మోదీ. అనంతరం మంగళవారం దానిపై స్పష్టతనిచ్చారు. తన సామాజిక మాధ్యమ ఖాతాలను స్ఫూర్తినిచ్చే మహిళలకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు ప్రధాని. 'షి ఇన్స్పైర్స్ యూ' హ్యాష్‌ట్యాగ్‌తో ఇలాంటి స్ఫూర్తినిచ్చే మహిళల కథలను పంచుకోవాలని ప్రజలను కోరారు.
అయితే.. మహిళల భద్రత అంశంలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే మోదీ ఇలా చేస్తున్నారని సుస్మితా దేవ్ ఆరోపించారు.