ఒక పెళ్లి జరగాలంటే ఏం కావాలి? చాలానే కావాలి కానీ... ముందు వరుడు-వధువు అయితే తప్పనిసరి. ఇద్దరిలో ఏ ఒక్కరు లేకున్నా పెళ్లే జరగదు. అబ్బా.. మాకు తెలియదుమరి అంటారా. అలా అయితే.. వధువు లేకుండానే జరిగిన ఓ కొత్తరకం పెళ్లి గురించి తెలుసుకోండి. అలాంటిలాంటి పెళ్లి కాదు. బ్యాండ్ బాజా బరాత్, విందు భోజనాలతో ఎంతో ఘనంగా జరిగింది. ఇంతకీ ఈ పెళ్లి కథేంటి?
గుజరాత్ సాబర్కాంఠా జిల్లా చాప్లనర్కు చెందిన అజయ్ బరోట్కు మతిస్థిమితం లేదు. ఊళ్లో జరిగిన పెళ్లిళ్లకు కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యేవాడు. అవి చూసిన అతడికి పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగింది. రోజూ పెళ్లి, పెళ్లి అని తల్లిదండ్రులను అడగటం మొదలు పెట్టాడు. అజయ్ కోరికపై గుజరాత్ ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్న అతడి తండ్రి విష్ణుభాయ్ బరోట్ ఆలోచించారు. అజయ్ ముచ్చట తీర్చేందుకు పెళ్లి చేయాలని తీర్మానించారు.
మనస్థిమితం లేని వారికి పిల్లనివ్వటానికి ఎవరూ రారు కదా..? అందుకే వధువు లేకుంటే ఏంటి? కుమారుడికి పెళ్లి చేసేద్దాం అనుకున్నారు ఆ కుటుంబ సభ్యులు. రూ. 2 లక్షల ఖర్చుతో పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. శుభలేఖలు వేయించి బంధువులకు, మిత్రులకు పంచారు.
పెళ్లి రోజున షేర్వాణీ ధరించి ఘనంగా పెళ్లికి సిద్ధమయ్యాడు అజయ్. అనుకున్నట్లుగానే వధువు లేకుండానే పెళ్లి జరిపించేశారు. మెహందీ, సంగీత్, నిర్వహించారు. విందు భోజనం పెట్టించారు. బరాత్ జరిపించారు. ఇలా పెళ్లిలో జరగాల్సినవేమీ తగ్గకుండా ఘనంగా వేడుక చేశారు. 800 మందికి పైగా బంధువులు హాజరయ్యారు.
వరుడు ఖుష్ అయ్యాడు. కుటుంబం సంతోషించింది.
ఇదీ చూడండి: 'పిట్రోడా వ్యాఖ్యలు దురహంకారానికి ప్రతీక'