తెలిసీతెలియక నేరాలు చేసి జైలుపాలైతే.. వారి భవిష్యత్ అంధకారమేనా? ఇక వారి బతుకుల్లో వెలుగు నిండే అవకాశమే లేదా? కచ్చితంగా ఉందంటున్నారు గుజరాత్‌లోని, లాజ్పుర్ సెంట్రల్ జైలు అధికారులు. అందుకే ఆ జైలులో ఖైదీలకు శిక్షతో పాటు, క్రమశిక్షణ కూడా నేర్పుతున్నారు. ఇకపై నేరాలకు పాల్పడకుండా భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తున్నారు. ఆన్లైన్ క్లాసులు పెట్టించి 10వ తరగతి, ఇంటర్ పరీక్షలకు ఖైదీలను సిద్ధం చేస్తున్నారు.
సూరత్ జిల్లా సచిన్‌లోని లాజ్పుర్ సెంట్రల్ జైల్లో మొత్తం 2100 మంది ఖైదీలున్నారు. ఒక్క తప్పుతో వారి భవిష్యత్తు నాశనం కాకూడదని భావించిన జైలు అధికారులు.. ఆసక్తి ఉన్న వారిని చదివించాలని నిర్ణయించారు. పలు కేసుల్లో శిక్షను అనుభవిస్తున్న 63 మందికి ప్రత్యేకంగా ఆన్లైన్ క్లాసులు ఏర్పాటు చేశారు.
పీపీ సావని స్కూలు సిబ్బంది ఆన్లైన్లో ఖైదీలకు పాఠాలు బోధిస్తున్నారు. 2019లో 13 మంది ఇలా ఆన్లైన్ క్లాసులు విని.. ఎస్ఎస్సీ పాసయ్యారు. దీంతో, గుజరాత్‌లోనే ఖైదీలకు ఆన్లైన్ క్లాసులు పెట్టించిన తొలి జైలుగా నిలిచింది లాజ్పుర్ సెంట్రల్ జైల్. ఇప్పుడు జైలు సూపరింటెండెంట్ మనోజ్ నినామా ఆధ్వర్యంలో.. 63 మంది ఖైదీలతో మరో అకడమిక్ సెషన్ ప్రారంభమైంది.
ఇదీ చదవండి: 'కరోనా వేళ జైలు గోడలే మాకు శ్రీరామ రక్ష'