ప్రస్తుత ఆర్థిక మాంద్యానికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలే కారణమని ప్రధాని మాజీ ఆర్థిక సలహాదారు అంగీకరించినట్లు తెలిపారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. పార్లమెంట్ సాక్షిగా జీఎస్టీని కాంగ్రెస్ తప్పబట్టినట్లు గుర్తు చేశారు.
''జీఎస్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లోపభూయిష్ట నిర్ణయాలే ఆర్థిక మాంద్యానికి ప్రధాన కారణమని ప్రధాని మాజీ ఆర్థిక సలహాదారు ఒప్పుకున్నారు. కానీ ఈ సందర్భంగా నోట్ల రద్దు విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు.''
- కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ట్వీట్.
ప్రస్తుత జీఎస్టీ విధానాన్ని పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టినట్లు గుర్తు చేశారు.
'అందరం కలిసి జీఎస్టీ విధానాన్ని ఏర్పాటు చేశామని ఆర్థిక మంత్రి సీతారామన్ చెప్పారు. అది అవాస్తవం. పార్లమెంట్ సాక్షిగా జీఎస్టీ ముసాయిదాను వ్యతిరేకించాం. నా ప్రసంగాన్ని చూడండి.'
-చిదంబరం.
భాజపా ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి తప్పుడు నిర్ణయాలే ఆర్థిక మందగమనానికి ప్రధాన కారణమని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత. ప్రస్తుతం చిదంబరం ఐఎన్ఎక్స్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సెప్టెంబర్ 5 నుంచి తిహార్ జైల్లో ఉన్నారు.
ఇదీ చూడండి:నోబెల్ గ్రహీత అభిజిత్‌పై ప్రశంసల వెల్లువ