ఇటీవల తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా 400లకు పైగా విద్యావేత్తలు, దేశవిదేశాల్లోని పలు విశ్వవిద్యాలయాలు కేంద్రాన్ని కోరాయి. కొత్త చట్టాలు దేశ రైతాంగానికి ముప్పు తెచ్చే విధంగా ఉన్నాయని పేర్కొన్నాయి. దీల్లీ సరిహద్దుల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైనా ఆందోళన వ్యక్తం చేశాయి.
"నూతన చట్టాలు దేశ వ్యవసాయ విధానంలో ప్రాథమిక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ఉన్నాయి. అవి దేశవ్యాప్తంగా వ్యవసాయ వర్గాలకు తీవ్ర ముప్పుగా పరిణమించే ప్రమాదముంది."
-విద్యావేత్తలు, విశ్వవిద్యాలయాల సంయుక్త ప్రకటన
'ఈ అంశంపై కేంద్రం పునరాలోచన చేయాలి. రైతులు, అట్టడుగు వర్గాలకు దీర్ఘకాలంలో మేలు చేసే విధానాలు రూపొందించే ముందు దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. గ్రామస్థాయి నుంచి అన్ని విభాగాలతో చర్చించిన తర్వాతే వాటిని తీసుకురావాలి. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు.. ఇంకా ఆలస్యం చేయకుండా తక్షణమే నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలి.' అని పేర్కొన్నాయి.
జేఎన్‌యూ, ఐఐటీ కాన్పుర్, ఐఐటీ మద్రాస్, ఐఐఎస్సీ బెంగళూరు, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కోల్‌కతా, ఐఐటీ బాంబే, ఐఐఎం కోల్‌కతాల విద్యావేత్తలు, పలు విదేశీ విశ్వవిద్యాలయాలు ఈ ప్రకటనపై సంతకాలు చేసిన జాబితాలో ఉన్నాయి.
గత నెల కూడా దేశవ్యాప్తంగా ఉన్న 850కి పైగా విద్యావేత్తలు, పలు విద్యా సంస్థలు సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలనే బహిరంగ లేఖపై సంతకాలు చేశాయి.
ఇదీ చదవండి:కిసాన్ మహాపంచాయత్‌లో అపశ్రుతి- కూలిన వేదిక