జమ్ముకశ్మీర్‌పై ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు ఆ రాష్ట్ర ప్రధాన పార్టీల నేతలు. అధికరణ 370, 35ఏ రద్దు రాజ్యాంగ విరుద్ధమని ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని ఆరోపించారు. ప్రజల తరఫున పోరాటానికి సిద్ధమని ప్రకటించారు.
ప్రజాస్వామ్యంలో చీకటి రోజు: ముఫ్తీ
ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంతో ఆర్టికల్ 370, 35ఏ రద్దు చేయటం అక్రమం, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ. కశ్మీర్‌కు ఇచ్చిన వాగ్ధానాలను భారత్ వమ్ము చేసిందన్నారు. నేడు ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రభుత్వ నిర్ణయం భవిష్యత్తులో విపత్కర పరిణామాలను కలిగిస్తుందన్నారు. ప్రజలను భయపెట్టడం ద్వారా జమ్ముకశ్మీర్ భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు ముఫ్తీ.
పోరాటానికి సిద్ధం: ఒమర్ అబ్దుల్లా
ఆర్టికల్ 370 రద్దు తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. భాజపా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని.. రాష్ట్ర ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. రాజ్యాంగబద్ధంకాని ఈ నిర్ణయాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ సవాల్ చేస్తుందని తెలిపారు ఒమర్ అబ్దుల్లా. ప్రజల తరఫున ప్రభుత్వంతో సుదీర్ఘ పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'చారిత్రక నిర్ణయంతో 70ఏళ్ల కల సాకారం'