ఆడపిల్లల వివాహానికి కనీస వయసును సమీక్షించి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వయసు పెంచాలంటూ దేశం నలుమూలల నుంచి అనేక అభ్యర్థనలు వస్తున్నట్లు మోదీ చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో.. మహిళల పెళ్లి వయస్సు పెంపునకు సంబంధించి కమిటీ వేసినట్లు ప్రకటించిన మోదీ.. ఆ నివేదికను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ప్రస్తుతం మహిళల కనీస పెళ్లి వయస్సు 18 ఏళ్లు కాగా పురుషులకు 21 ఏళ్లుగా ఉంది. గడచిన ఆరేళ్లలో బడులకు వెళ్తున్న బాలుర సంఖ్య కంటే బాలికలదే ఎక్కువగా నమోదవుతున్నట్లు వెల్లడించారు మోదీ. మహిళల్లో పౌష్టికాహార లోపాన్ని తగ్గించే కార్యక్రమాన్ని పవిత్ర భావంతో చేపడుతున్నామన్నారు. స్వచ్ఛభారత్ కింద దేశవ్యాప్తంగా 11 కోట్ల మరుగుదొడ్లు కట్టించినట్లు వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు శానిటేషన్ ప్యాడ్‌లను రూపాయికే అందిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: 'పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు చర్యలు'