70 ఏళ్ల నుంచి నానుతున్న సమస్య. ప్రతిరోజూ తుపాకీ గుళ్ల చప్పుళ్లతో అలసిపోయిన ప్రాంతం. ఓ వైపు ఉగ్రవాదులు, వేర్పాటు వాదులు.. మరోవైపు అల్లరిమూకలు, ఉగ్రపంజాలో చిక్కుకుపోయిన యువకులు. ఇది కశ్మీరు పరిస్థితి. అయితే మోదీ 2.0 సర్కారు నేడు కశ్మీరు సమస్య పరిష్కారానికి రామబాణం వదిలింది.
ఓ వైపు వేల సంఖ్యలో బలగాల మోహరింపు... మరోవైపు కీలక నేతల గృహనిర్బంధం... ఎక్కడికక్కడ 144 సెక్షన్ విధింపు... జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ నిత్యపర్యవేక్షణ.. ఏం జరుగుతుందో అన్న సందేహాలు దేశ ప్రజల మదిని తొలిచేస్తున్న వేళ... "370 అధికరణ రద్దు" అంటూ రాజ్యసభలో ప్రకటన చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
చకచకా...
జమ్ముకశ్మీర్‌కు సంబంధించి కీలక పరిణామాలు వేగంగా చోటు చేసుకొన్నాయి. ఉదయం కేబినెట్ భేటీ, భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం పూర్తయ్యాయి. అనంతరం ఆర్టికల్ 370ను రద్దు , 35(ఏ) రద్దు , రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించిన తీర్మానాలు, బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
- ఇదీ చూడండి: కశ్మీర్: 370, 35ఏ అధికరణలు రద్దు
గందరగోళం...
అమిత్ షా ప్రకటనతో సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. విపక్ష సభ్యులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.
అదే సమయంలో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి వెనువెంటనే ఆదేశాలు జారీ చేశారు.
ఏంటీ 370..?
370 అధికరణ రద్దుతో జమ్ముకశ్మీర్‌లో భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. ఆర్టికల్ 370(3)తో జమ్ముకశ్మీర్... లెజిస్లేటీవ్ అసెంబ్లీగా మారుతుంది. ఇక జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో బిల్లులు రాష్ట్రపతి అమోదానికి పంపించే అవకాశం ఏర్పడింది.
- ఇదీ చూడండి: ఆపరేషన్ కశ్మీర్: ఆర్టికల్ 370 అంటే ఏంటి?
35ఏ అధికరణ..?
కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370లో 35-ఎ నిబంధన ఒక భాగం. ఈ నిబంధన కశ్మీర్‌లోని శాశ్వత నివాస నిబంధనలను సమగ్రంగా విశదీకరిస్తుంది.
- ఇదీ చూడండి: ఆపరేషన్ కశ్మీర్: ఏంటీ ఆర్టికల్ 35-ఎ?
రాష్ట్ర విభజన..
370 రద్దుతోపాటు ఉమ్మడి జమ్ముకశ్మీర్‌ను జమ్ము-కశ్మీర్, లద్దాక్ ప్రాంతాలుగా విభజించేందుకు కేంద్రం సిద్ధమైంది. వీటిలో జమ్ము-కశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా.. లద్దాఖ్ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించనున్నాయి.
- ఇదీ చూడండి: దేశంలో ఇక 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు
ఖండించిన కాంగ్రెస్...
జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అన్ని రకాలుగా భిన్నమైన ప్రజలు నివసిస్తున్న జమ్ముకశ్మీర్‌ను రెండు ప్రాంతాలుగా విడగొట్టిన ఈ రోజు భారత చరిత్రలో చీకటి రోజని వ్యాఖ్యానించింది.
- ఇదీ చూడండి: '370 రద్దుతో భాజపా ఓటు బ్యాంకు రాజకీయం'
పోరాడతామని ప్రకటన...
ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంతో ఆర్టికల్ 370, 35ఏ రద్దు చేయటం అక్రమం, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు ఒమర్ అబ్దుల్లా.
- ఇదీ చూడండి: ఏకపక్ష నిర్ణయంపై యుద్ధానికి సిద్ధం: అబ్దుల్లా
నిర్ణయంపై హర్షం...
ఆర్టికల్ 370 రద్దు సంతోషకరమైన విషయమన్నారు భాజపా అగ్రనేత ఎల్ కే అడ్వాణీ. జాతీయ సమగ్రత బలోపేతం దిశగా ఇదో గొప్ప ముందడుగని అభివర్ణించారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని భాజపా మిత్రపక్షం శివసేన సహా పలు విపక్ష పార్టీలు స్వాగతించాయి.
- ఇదీ చూడండి: మోదీ, షాల సాహసం భేష్: అడ్వాణీ
హైఅలర్ట్...
దేశ అంతర్గతంగా, అలానే సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పక్కా వ్యూహరచన చేసింది కేంద్రం. భారత సైన్యం, వాయుసేన, కశ్మీరు బలగాలను అప్రమత్తం చేసింది.
బిహార్, ఉత్తరప్రదేశ్ సహా దేశంలోని పలు సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
- ఇదీ చూడండి: దేశమంతా హై అలర్ట్.. కశ్మీర్‌కు మరిన్ని బలగాలు
స్వయంగా మోదీ...
కశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ విషయాన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా ఫోన్ చేసి తెలియజేసినట్లు సమాచారం.
- ఇదీ చూడండి: 'మోదీ మార్క్' సాహసం... ఆపరేషన్ కశ్మీర్
మోదీ-షా మళ్లీ హిట్...!
భాజపాలో కార్యదక్షుడిగా పేరున్న అమిత్ షాకు హోంశాఖ బాధ్యతలు అప్పగించినప్పుడే జమ్ము-కశ్మీర్‌లోని ఆర్టికల్ 370కి రోజులు దగ్గర పడ్డాయని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఎంతటి అసాధ్యాన్ని అయినా భయపడకుండా చేయడం షా శైలి. నేడు సభలో ఇది కళ్లకు కట్టినట్టు కనిపించింది. ప్రతిపాదన ప్రవేశపెట్టే సమయంలో ఆ ప్రతులను ముందస్తుగా సభ్యులకు ఇవ్వలేదు. ఆయన ప్రకటించాకే సభ్యులకు వాటిని పంపిణీ చేశారు. అమిత్ షా ప్రకటన వెలువడిన వెంటనే రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయడం షా-మోదీల వ్యూహ చతురతకు అద్దం పడుతోంది.
- ఇదీ చూడండి: 370, 35ఏ రద్దు... కశ్మీర్ ఇక అందరితో సమానమే