లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత ఎలా వ్యవహరించాలన్న విషయమై కేంద్రం కసరత్తు చేస్తోంది. మే 4 నుంచి చేయాల్సిన పనులపై ఇప్పటికే ప్రణాళికను రూపొందించినట్లు తెలుస్తోంది. కరోనా విస్తరణను అదుపు చేయడం, ఆర్థిక రంగాన్ని పునరుద్ధరించడం మధ్య సమతౌల్యాన్ని పాటిస్తూ "కనిష్ఠ చలనం... గరిష్ఠ పని" అన్న నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్లనుంది.
ముఖ్యమంత్రులతో సోమవారం ఉదయం జరపనున్న వీడియో సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రణాళిక గురించి చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు స్వీకరించిన తరువాతనే కార్యాచరణ ప్రణాళికను కేంద్రం ఖరారు చేయనుంది. క్రమేణా ఆంక్షలను సడలించాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ విషయంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకునే స్వేచ్ఛను రాష్ట్రాలకు ఇవ్వనుంది.
విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం కేంద్రం ప్రతిపాదించిన ప్రణాళికలో ఈ కింది అంశాలు ఉండనున్నాయి.
- రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్లో కొందరు ఇళ్ల నుంచే విధులు నిర్వర్తించే అవకాశం ఉంది.
- కర్మాగారాలు, వ్యాపార సంస్థల్లో పనిచేసేందుకు భౌతిక దూరం పాటించేలా షిఫ్టు వేళల్లో మార్పులు చేసే అవకాశం. ఈ విషయంలో పారిశ్రామిక సంస్థలు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని అమలు చేయనుంది.
- తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇస్తూ కరోనా సోకని గ్రీన్ జోన్ ప్రాంతాల్లో ఆర్థిక కార్యక్రమాలు కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉంది.
విదేశాల్లోని భారతీయుల కోసం విమానాలు
విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం మే 3 తరువాత ప్రత్యేకంగా విమానాలు నడపాలని పౌర విమానయాన శాఖ నిర్ణయించింది. వారికి ఆసుపత్రుల్లో పడకలు, క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
ప్రధాని సమీక్షించనున్న అంశాలు
- వివిధ రాష్ట్రాల్లో కరోనా తాజా పరిస్థితి, నివారణకు తీసుకుంటున్న చర్యలు
- కేంద్ర హోం శాఖ ఈ నెల 20న పంపించిన మార్గదర్శకాల అమలు తీరు
- మే 3 తరువాత ఏమి చేయాలనేదానిపై అభిప్రాయాలు తెలుసుకోవడం
ప్రయాణాల మాటేమిటి?
- మే మూడో తేదీ తరువాత... తక్షణమే రైలు, విమాన ప్రయాణ సేవలు ప్రారంభించే అవకాశాలు లేవు. జిల్లా పరిధిలో ప్రయాణించడానికి వెసులుబాటు కల్పించవచ్చు. సరకుల రవాణా కోసమే విమానాలు, రైళ్లను నడుపుతారు.
- ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణికుల కోసం వీటిని నడిపే అవకాశం ఉంది. వలస కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లడం కోసం రైళ్లు నడిపేందుకు అనుమతి ఇచ్చే వీలుంది.
- తొలుత పరిమిత సంఖ్యలో విమాన సేవలకు అనుమతి ఇవ్వాలన్న ఆలోచన ఉంది. కంటైన్‌మెంట్ జోన్లు, రెడ్ జోన్లలోని పరిస్థితిపై మే 15 తరువాతే సమగ్రమైన సమాచారం అందుతుంది. దాన్ని విశ్లేషించిన అనంతరం ప్రయాణాలకు అనుమతించడంపై తుది నిర్ణయం తీసుకుంటారు.
పొడిగింపునకే మొగ్గు..
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నందున.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్ పొడిగింపునకే మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలో..!
దేశంలో కరోనా కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో ఆంక్షల సడలింపుపై కేంద్రం ప్రకటన అనంతరమే నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. వచ్చేవారం నెలకొనే పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
మిగతా రాష్ట్రాల్లో..
కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా మాత్రమే దిల్లీలో ఆంక్షలను అమలు చేస్తామని తెలిపారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్ కొనసాగించాలని ప్రధానిని కోరే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: 'దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితుల్లో మెరుగుదల'