కేంద్రంపై మరోమారు విమర్శనాస్త్రాలను సంధించింది కాంగ్రెస్. సామాన్యులకు అండగా ఉంటామని చెబుతూనే వారి వెన్ను విరిచే విధానాలను కేంద్రం ప్రోత్సహిస్తోందని హస్తం పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అభిప్రాయపడ్డారు. సామాన్యుడిపై భాజపా మొసలి కన్నీరు కారుస్తోందని ఆరోపించారు. ఇందుకు జీవిత, వాహన బీమా ప్రీమియంలను పెంచే ప్రతిపాదనలు, ఈపీఎఫ్ వడ్డీ రేటును తగ్గించే నిర్ణయాలు ఓ కారణమన్నారు.
ఉత్పాదకత, ఉపాధి, రూపాయి పతనం, ద్రవ్యోల్బణం, సామాజిక విభేదాలు వంటి సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి అహంకారం పెరిగిందని మండిపడ్డారు సింఘ్వీ.
దిగువ, మధ్య తరగతి వారిపై భారం
వాహనాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం 20 శాతం పెంచడం వల్ల ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలపై ప్రభావం పడనుందని తెలిపారు సింఘ్వీ. అయితే ఈ నిర్ణయాలను ఆపే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్నారు. దీని వల్ల దిగువ, మధ్య తరగతి కుటుంబాలపై అధిక భారం పడుతోందన్నారు.
" కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నిర్ణయాలను ఆపే అధికారం ప్రభుత్వానికి ఉన్నా ఆ దిశగా జోక్యం చేసుకోవడం లేదు. రెగ్యులేటర్లను సమర్థిస్తూనే సామాన్యుడిపై మొసలి కన్నీరు కారుస్తోంది ప్రభుత్వం. ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.144 పెంచింది. అందులోనూ ఈ పెరిగిన ధర సబ్సీడీకి వర్తించదు. ఒక్కో ఇంటికి 12 సిలిండర్ల సబ్సీడీ ఉన్నా అందడం లేదు. అదే విధంగా ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.65 నుంచి 8.5కు తగ్గించింది ప్రభుత్వం."
-- అభిషేక్ మను సింఘ్వీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
ఈ పథకాలన్నీ వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. యస్ బ్యాంక్ సంక్షోభం గురించి ప్రస్తావించిన సింగ్వీ డిపాజిటర్ల డబ్బు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఇదీ చదవండి: నారీమణుల చేతుల్లో మోదీ ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాలు