దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు తాగునీటి సరఫరా అందించేందుకు చర్యలు చేపట్టింది కేంద్రం. ఇందులో భాగంగా.. 100 రోజుల ప్రచార కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించింది జల్ శక్తి మంత్రిత్వ శాఖ. దీనిని 'జన్ ఆందోళన్(ప్రజా ఉద్యమం)'గా భావించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలకు నాయకత్వం వహించాలని కోరుతూ.. పాలనాధికారులకు లేఖ రాశారు.
ప్రతి ఇంటికీ మంచినీటి సరఫరా
సెప్టెంబర్ 29న 'జల్ జీవన్ మిషన్(జేజేఎమ్)'ను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సరఫరా ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో 100 రోజుల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు షెకావత్. 2024 నాటికి 'జల్ జీవన్ మిషన్- హర్ ఘర్ జల్' కింద ప్రతి ఇంటికీ మంచి నీటి సరఫరా కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి తెలిపారు.
కలుషిత నీటి కారణంగా అనేక ప్రాంతాల్లో పిల్లలు వ్యాధుల బారినపడుతున్న తరుణంలో.. సురక్షిత నీటిని అందించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు మంత్రి. ఇందుకోసం పాఠశాలలు, అంగన్వాడీ, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో పంపు నీటి కనెక్షన్లను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అతిపొడవైన అటల్ సొరంగం- అత్యద్భుత నిర్మాణ కౌశలం