కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పరిహారం చెల్లింపుల విషయంలో కేంద్రం పలు మార్పులు చేసింది. ఇక నుంచి విధి నిర్వహణలో దివ్యాంగులుగా మారిన ఉద్యోగులకు పరిహారం చెల్లింపు వర్తిస్తుందని ప్రకటించింది. వారు విధుల్లో కూడా కొనసాగుతారని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.
ఇది వరకే ఉంది.. కానీ..
ప్రభుత్వం చేసిన సడలింపులు 2009 వరకు అమలులోనే ఉన్నాయి. 2004 జనవరి 1 లేదా ఆ తర్వాత నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను దివ్యాంగ పరిహారం చెల్లింపు పరిధి నుంచి 2009లో కేంద్రం తొలగించింది. జాతీయ పింఛను పథకం కింద ఉన్న వారిని కూడా ఈ పరిధి నుంచి తీసేసింది.
ఇప్పుడు అమలులో..
కుటుంబ పింఛనుకు.. కనీస అర్హతైన ఏడేళ్ల విధి నిర్వహణ పూర్తి కాకుండా ఉద్యోగి మృతిచెందితే పింఛను వర్తించదు. ప్రభుత్వం ప్రస్తుతం ఈ నిబంధనను సడలించింది. విధి నిర్వహణలో ఏడేళ్లు కాకపోయినా, ఒకవేళ మృతిచెందితే అతని కుటుంబానికి పింఛను లభిస్తుందని జితేంద్ర స్పష్టం చేశారు.
ఆరోగ్య కారణాల రీత్యా 10ఏళ్లలోపే పదవి విరమణ పొందిన వారికి కూడా వారి జీతంలో 50 శాతాన్ని పింఛనుగా అందిస్తామని అన్నారు. ఈ నిర్ణయం సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ వంటి పారామిలటరీ సిబ్బందికి ఎంతో మేలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త