అహ్మదాబాద్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. గోఎయిర్కు చెందిన ఓ విమానం గాల్లోకి ఎగురుతున్న సమయంలో కుడివైపు ఉన్న ఇంజిన్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది విహంగాన్ని నిలిపేశారు. వెంటనే మంటలు ఆర్పివేయటం వల్ల ప్రయాణికులు, విమాన సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.
బెంగళూరు-అహ్మదాబాద్ మధ్య తిరిగే గోఎయిర్ జీ8 802 విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ఇవాళ ఉదయం బయలుదేరిన క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అందులోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు సంస్థ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొన్నారు.
"అహ్మదాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే గోఎయిర్ విమానం టేకాఫ్ సమయంలో కుడి ఇంజిన్ ఫ్యాను రెక్కలు విరిగిపోయినట్లు అనుమానిస్తున్నాం. దానివల్ల ఇంజిన్లో స్వల్పంగా మంటలు చెలరేగాయి. వెంటనే ఆర్పివేశాం. ప్రయాణికులతో పాటు సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఎలాంటి అత్యవసర తరలింపు అవసరం లేదు. ప్రయాణికులకోసం ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేశాం. బెంగళూరు విమానాశ్రయ రన్వే మధ్యాహ్నం 3 గంటల వరకు మూసివేసిన కారణంగా అహ్మదాబాద్ నుంచి 1.30 గంటలకు ఈ విమానం బయలుదేరుతుంది. "
- గోఎయిర్ సంస్థ
విమానం ఇంజిన్లో మంటలు చెలరేగిన సమయంలో అందులో ఎంతమంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారో ఇంకా తెలియరాలేదు.
ఇదీ చూడండి: మిడతల నివారణకు భారత్ వైపు పాక్ చూపు!