కర్ణాటకలోని బెంగళూరులో మరో ప్రేమ ఉన్మాదం బయటపడింది. పెళ్లికి అంగీకరించలేదని ప్రియురాలిని పొడిచి చంపాడో ప్రియుడు.
బెంగళూరు రాజాజినగర్కు చెందిన అభి గౌడ.. ప్రకాశనగర్కు చెందిన ఓ యువతి కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే అభి రౌడీలతో తిరుగుతాడని, గూండాయిజం చేసి డబ్బులు సంపాదిస్తున్నాడని కొద్ది రోజుల క్రితమే గర్ల్‌ఫ్రెండ్‌కు తెలిసింది. దీంతో అభిని దూరం పెట్టడం మొదలుపెట్టింది. అందుకు అభి కోపంతో రగిలిపోయాడు. ఓసారి మాట్లాడాలంటూ ప్రేయసిని పిలిపించాడు.
బాయ్‌ఫ్రెండ్ ఓ క్రూరుడని తెలిసినా... ఎక్కడో కొంతైనా మానవత్వం మిగిలుంటుందని నమ్మి అభిని కలిసేందుకు వచ్చింది ఆ యువతి. అదే ఆమె చేసిన తప్పైంది. అభి ఓ చేతిలో మంగళసూత్రం.. మరో చేతిలో కత్తి పట్టుకుని.. 'పెళ్లి చేసుకుంటావా? చస్తావా?' అని నిలదీశాడు. బలవంతంగా తాళిని మెడలో కట్టేందుకు ప్రయత్నించాడు. ప్రియురాలు అందుకు నిరాకరించింది. దీంతో కోపంతో ఊగిపోయిన అభి.. కత్తితో ఆమెను విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు.
బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులు అభిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత గర్ల్‌ఫ్రెండ్‌ను చంపింది తానేనంటూ పోలీసుల ముందు లొంగిపోయాడు ఆ ఉన్మాది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి: ప్రేమ.. పెళ్లి.. గర్భం... చివరికి బాలిక హత్యకు పన్నాగం!