లాక్డౌన్ కారణంగా చాలా మంది ఇంట్లో ఏం చేయాలో తోచక తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. అలాంటి వారికోసం కేరళ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎవరికైనా ఇంట్లో కాలక్షేపం కాకపోతే.. పోలీసులే స్వయంగా ఆర్కెస్ట్రాతో వచ్చి పాటలతో అలరిస్తున్నారు.
పాలక్కడ్ జిల్లాలోని కొండ ప్రాంతమైన నెల్లియంపత్తి గ్రామంలో ఎక్కువగా తోట పని చేసుకొనే కార్మికులు నివసిస్తున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ వల్ల అక్కడి క్వార్టర్స్‌లోనే వారంతా ఉంటున్నారు. ఇంట్లో నుంచి బయటకు రాలేకపోవడం వల్ల చాలా మందికి ఏం చేయాలో తోచక, ఒత్తిడికి గురవుతున్నారు.
గ్రామస్థులందరికీ లాక్డౌన్ నుంచి కాస్త ఉపశమనం కలిగించేందుకు జనమైత్రి పోలీసులు ఆర్కెస్ట్రాతో వచ్చి పాటలను పాడి వినోదాన్ని పంచుకున్నారు. భక్తి గీతాలు, మప్పిలపట్టు, జానపద గేయాలు, సినిమా పాటలు ఇలా అన్ని రకాల సాంగ్స్‌తో ప్రజల్లో ఉత్తేజాన్ని నింపుతున్నారు. ఈ కార్యక్రమాన్ని పదగిరి ఎస్ఐ ఎం. హంస చేపట్టారు.
పాటలు పాడే పోలీసులు ఎవరికీ సంగీతంపై పట్టులేదు. స్మార్ట్‌ఫోన్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతుంటే... చిన్నపాటి మైకు సాయంతో వారు పాట పాడుతున్నారు. అయితే లాక్డౌన్ నిబంధనలను పాటిస్తున్న వారికే ఈ వినోదాన్ని పంచుతామని పోలీసులు తెలిపారు. ఎవరైనా ఉత్తర్వులను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.