వినాయక చవితి అంటే ఆ జోరే వేరు. దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఏ వీధి చూసినా ఏకదంతుడి మండపాలే కనిపిస్తాయి. వారం రోజుల ముందు నుంచే ఈ వేడుకల హడావుడి కనిపిస్తుంది. నవరాత్రుల పాటు... పూజలు, ఆట, పాటలతో కోలాహలం నెలకొంటుంది. కానీ.. కరోనా మహమ్మారి విజృంభణతో ఈ ఏడాది ఆ సందడి కనిపించటంలేదు. చాలా రాష్ట్రాలు ఉత్సవాలకు అనుమతులు లేవని స్పష్టం చేశాయి. ఎవరికి వారు ఇంట్లోనే పూజలు చేసుకోవాలని చెబుతున్నాయి.
కరోనా కష్టాలు తీర్చవయ్యా...
వినాయక చవితితో ఉపాధి పొందుతోన్న వేలాది మందిపై తీవ్ర ప్రభావం చూపింది కరోనా. విగ్రహాల అమ్మకాలు లేక తీవ్రంగా నష్టపోతున్నారు తయారీదారులు. కూలీలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు. వినాయక చవితి లైటింగ్, మండపాలు, సౌండ్ సిస్టమ్స్, బ్యాండ్, డెకరేషన్ సేవలు అందించే చాలా మంది ఉపాధిని దెబ్బతీసింది. ఎటు చూసినా కరోనా మయం. ఏమీ చేయలేక ఇబ్బందులు పడుతూ.. కరోనా విఘ్నాలు తొలిగించయ్యా విఘ్నరాజా అంటూ వేడుకుంటున్నారు ప్రజలు.
మహారాష్ట్రలో కనిపించని సందడి..
గణేశుడి వేడకులను ఘనంగా నిర్వహించే.. మహారాష్ట్రలో ఈ ఏడాది ఆ సందడే కనిపించటం లేదు. కరోనా జాగ్రత్తలు, భౌతిక దూరం పాటిస్తూ ఉత్సవాలు జరుపుకోవాలని కోరింది మహా ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వ చర్యల్లో భాగస్వామ్యం కావాలని నిర్ణయించాయి ముంబయిలోని ప్రముఖ గణేశ్ మండళ్లు.
- వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్లాస్మా దానం చేయాలని నిర్ణయించింది లాల్‌భాగ్ చా రాజా సార్వజనిక్ గణేశ్ మండల్. ఆగస్టు 3-31 వరకు రక్తదానం శిబిరం నిర్వహిస్తున్నారు. అలాగే.. తూర్పు లద్దాఖ్ సరిహద్దులో అమరులైన సైనికుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. దాంతో పాటు కరోనా పోరులో ప్రాణాలర్పించిన పోలీసుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఇవ్వనున్నారు.
- 'ముంబాయ్ చా రాజా మండల్' ఆధ్వర్యంలో ఏటా ఏర్పాటు చేసే 22 అడుగుల ఎత్తైన విగ్రహం బదులుగా.. 3 అడుగుల ఎత్తు ప్రతిమ పెట్టాలని నిర్ణయించారు. దర్శనాలకు భక్తులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
దిల్లీలోనూ..
దేశ రాజధాని దిల్లీలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. 28 ఏళ్ల చరిత్ర గల గురగ్రామ్‌లోని సార్వజనిక్ గణేశ్ ఉత్సవ సమితి.. పూర్తిగా ఆన్‌లైన్‌కే పరిమితమవుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
ఎన్సీఆర్ ప్రాంతంలోని పురాతన మండపాల్లో మరాఠీ మిత్ర మండల్ ఒకటి. ఇక్కడ 10 రోజుల పాటు జరగాల్సిన ఉత్సవాన్ని కేవలం ఒకటి, ఒకటిన్నర రోజులకే కుదించేస్తున్నారు. ఎక్కువ మంది భక్తులను అనుమతించకుండా.. ఫేస్బుక్, జూమ్, గూగుల్‌లో దర్శనాల కోసం లైవ్‌లు ఏర్పాట్లు చేస్తున్నారు.
మూలికలతో గణేశుడి విగ్రహాలు..
కరోనా మహమ్మారితో పరిస్థితులు మారిపోయాయి. రోగనిరోధక శక్తిని పెంచే మూలికలు, సుగంధద్రవ్యాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఛత్తీగఢ్‌లోని రాయ్‌పుర్‌కు చెందిన కొందరు.. వినాయక విగ్రహాలను మూలికలతో తయారు చేసి కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. దాల్చిన చెక్క, మిరియాలు, సొంటి వంటి వాటితో విగ్రహాలను రూపొందించి... రోగనిరోధక శక్తి పెంచుకోవటంలో వాటి పాత్రను తెలియజేస్తున్నారు.
చాక్లెట్ గణేశ్‌తో కొవిడ్‌పై అవగాహన..
మధ్యప్రదేశ్ ఇందోర్‌లోని శ్రీనగర్ ప్రాంతానికి చెందిన నిధి శర్మ.. చాక్లెట్‌తో గణేశుడి విగ్రహాన్ని రూపొందించారు. విగ్రహానికి ఒక వైపు పోలీసులు, మరోవైపు వైద్యుల బొమ్మలు పెట్టారు. కరోనా యోధుల కృషిని తెలియజేసేలా.. రూపొందించి ప్రజల దృష్టిని ఆకర్షించారు నిధి. మాస్కులు, భౌతికదూరం పాటించటం, శానిటైజర్ల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు.