ఒక్క రక్తం చుక్క చిందకుండా... అహింసే ఆయుధంగా... రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. బానిస సంకెళ్లు తెంచి కోట్లమందికి స్వేచ్ఛ, స్వయం నిర్ణయాధికారాలు బహుమతిగా అందించారు. అలాంటి మహానుభావుడి 150వ జయంతి వేడుకల ప్రారంభ సందర్భంగా ఆయన స్మృతులను మననం చేసుకుంటోంది యావత్ భారతం.
"ఇతడు రక్త మాంసాలతో ఈ నేలపై నడయాడిన వ్యక్తి అంటే భావితరాలవారు నమ్మ లేరు''
- ఆల్బర్ట్ ఐన్ స్టీన్
"అసంఖ్యాక అభాగ్య భారతీయుల పక్షాన ఒక్కడిగా నిలబడి, వారి భాషలోనే మహాత్ముడు మాట్లాడారు. అశేష భారతావని ఇంతలా వేరెవరినీ ఆమోదించలేదన్నది సత్యం.
- విశ్వకవి రవీంద్రనాథ్‌ఠాగూర్
"జీసస్ నాకు సందేశం ఇచ్చాడు, గాంధీ దాన్ని ఆచరణలో చూపించాడు"
- మార్టిన్ లూథర్ కింగ్
ఇవి మాత్రమే కాదు. అందరి మాట అదే.
ఆయన జీవితం ఆదర్శం.... ఆయన మార్గం అనుసరణీయం... ఆయన కార్యశీలత ప్రశంసనీయం...
ఎందుకంత ప్రత్యేకమంటే.. సత్యం, అహింస. ఇవే సిద్ధాంతాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహమే ఆయుధాలు. కొల్లాయిగట్టి, చేత కర్రబట్టి, నూలు వడికి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ , కులాలూ ఒకటే అని చాటి, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడేలా చేశాడు ఆ మహాత్ముడు. భరతమాత దాస్య శృంఖలాలు తెంచి.. స్వాతంత్ర్యం సాధించిన సమర యోధుల్లో అగ్రగణ్యుడయ్యారు.
తన శరీరం అణువణువూ ఎన్నోసుసంపన్న సుగుణాలతో ముందుతరాలకు వెలుగుబాటలు చూపారు బాపూజీ. భారతదేశం శాంతి, సహనశీలతలకు తనొక చిహ్నం. ధర్మ, కర్తవ్యనిష్ఠలకు నిలువెత్తురూపంగా... నిలిచారు. 1869 అక్టోబర్2న కరమ్‌చంద్- పుతలీబాయి పుణ్యదంపతులు ద్వారా లోకం చూసిన ఆయన 150వ జయంతి ఉత్సవాల సమయ అపురూప సందర్భమిది.
ప్రేమతోనే మార్పు సాధ్యమని నమ్మిన గొప్ప మనిషి...
తనలానే ఇతరులూ ఉండాలని కోరుకుని... అందుకోసమే పరితపించిన మనీషి... మహాత్మా గాంధీ. అన్నింటికీ మించి.. ద్వేషించిన వారిని కూడా అమితంగా ప్రేమించటం, ఆ ప్రేమతోనే వారిని మార్చాలని ప్రయత్నించటం ఈ కాలంలో ఎందరికి సాధ్యం? నిజాయతీ, నిగ్రహం, పవిత్రతతో పంతం పట్టి జీవించటం ఎవ్వరితరం? జీవితం మొత్తం సత్యశోధనకే అంకితం చేయటం అంటే ఎంత సాహసం..?
తన విలువల సారాన్ని మొత్తాన్ని "సత్యమే దేవుడి"గా ప్రకటించటమే కాదు.. తరతరాల భారత ఆధ్యాత్మిక వికాసానికి, శాంతి సౌభాగ్యాలతో కూడిన జీవనవిధానానికి, ధర్మయుతమైన ప్రవర్తనకూ ప్రతీకగా నిలిచారు మహాత్ముడు. చేసిన తప్పుల నుంచి నేర్చుకోవటం, సత్యంతో చేసిన ప్రయోగాలతో నా జీవితమే నా సందేశం అన్నారు.
అరుదైన జాబితాలో బాపూజీ...
ప్రపంచ వికాస చరిత్రలో మనకు ఎందరో మహానుభావులు తారసపడతారు. వారంతా తమ తమ కాలాల్లో సమాజాన్ని ప్రభావితం చేసిన వాళ్లే. తర్వాత కాలంలో ఆధునికయుగ నిర్మాతలుగా నిలిచిన వారే. కానీ పూజ్యబాపూజీలా... ఇన్ని భిన్నపార్శ్వాలున్న వారు మాత్రం అత్యంత అరుదు.
గాంధీజీ తో పరిచయం ఉన్న ప్రతివ్యక్తి, ముఖ్యంగా ఆయనంటే, ఆయన భావాలంటే ఏ మాత్రం సరిపోలని వారు కూడా గాంధీ, ఆయన వ్యక్తిత్వంలో ప్రత్యేకతలు అంగీకరిస్తారు. తను లేరన్న మాట తెలిసిన రోజు పండిత్‌జవహార్‌లాల్ నెహ్రూ హృదయాంతారాల నుంచి వచ్చిన అశ్రునివాళే అందుకు నిదర్శనం.
''మనజీవితాల నుంచి వెలుగు వెళ్లిపోయింది లేదు అని నేను సరిగా చెప్పలేను. ఎందుకంటే ఈ దేశాన్ని తన వెలుగులతో నింపిన ఆ జ్యోతి సాధారణమైనది కాదు. వేల సంవత్సరాల తర్వాత కూడా ఆ వెలుగు ఈ దేశంలో కనిపిస్తూనే ఉంటుంది. ప్రపంచం దానిని చూస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ కాంతి జీవించి ఉన్న సత్యానికి ప్రతినిధి."
- పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ, భారతదేశ తొలి ప్రధానమంత్రి
మహాత్ముడి గురించి ఇంకా ఇంకా తెలుసుకోవటం నేటితరానికి అత్యవసరం. ఆయన పయనించిన మార్గంలో సాగటం అనుసరణీయం. సాటి లేని శక్తి, చెక్కు చెదరని స్ఫూర్తి మార్గనిర్దేశంలో గాంధీజీ అంటే ఏమిటో... తన సిద్ధాంతాలు ఈ రోజుకీ, ఈ సంక్షోభ సమయంలో ఎంత అవసరమో యావత్ ప్రపంచం కూడా గుర్తిస్తూనే ఉంది.