ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా చమోలి జిల్లాలోని గైరిసైన్ను అధికారికంగా ప్రకటించింది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆమోదం అనంతరం విడుదల చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్పల్ కుమార్ సింగ్.
ఈ విషయంపై ఉత్తరాఖండ్ భాజపా ఉపాధ్యక్షుడు దేవేంద్ర భాసిన్ హర్షం వ్యక్తం చేశారు. 2017లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీని నెరవేర్చామని చెప్పారు.
గైరిసైన్ను ఉత్తరాఖండ్ రెండో రాజధానిగా ఎంపిక చేసినట్లు బడ్జెట్ సమావేశాల సందర్భంగా మార్చి 4న ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్. గైరిసైన్లోనే జరిగిన అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన వేలాది మందికి రాష్ట్ర రెండో రాజధానిని అంకితం చేస్తున్నట్లు తెలిపారు.