దిల్లీ-ఘజీపుర్ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తోన్న నిరసన దీక్షకు తన వంతు మద్దతు తెలిపాడు నాలుగేళ్ల చిన్నారి రేహాన్. రేయి పగలు అని తేడా తెలియక రైతులు చేస్తోన్న ఆందోళనకు బాసటగా నిలిచాడు. తన వంతు సాయంగా వారికి బిస్కెట్లు, అరటి పండ్లు అందించాడు. బుడతడు చిట్టి చిట్టి చేతులతో ఆహారం అందించడం చూసిన అక్కడి వారు ఆశ్చర్యపోయారు.
"రైతులు నిరసన తెలిపే ఈ ప్రదేశానికి నేను రోజూ వస్తుంటాను. పదిరోజులుగా మా వంతు సాయంగా వారికి చిరు తిండ్లు అందిస్తున్నాను. రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు వారి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు. మాది బిహార్‌లోని వ్యవసాయ కుటుంబమే. నా సంపాదన 20 వేలు. అందులో నుంచి కొంతభాగం వారి కోసం ఖర్చు చేయడంలో ఆనందం ఉంది. నా కుమారుడు కూడా ఇందులో భాగం అయ్యాడు."
-మెహతాబ్ ఆలం, రేహాన్ తండ్రి
పుడమి పుత్రుల కోసం మరి కొందరు..
పక్షం రోజులు పైగా రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. ఇంటిని వదిలి రోజులు గడుస్తున్నా కానీ వెనుదిరగడం లేదు. వారి అన్నపానియాల కోసం కొందరు ముందుకు వస్తున్నారు. ఆ క్రమంలో పంజాబ్‌కు చెందిన గుర్వీందర్ సింగ్ అనే వ్యక్తి సుమారు 3వేల మంది రైతులకు సింఘు సరిహద్దులో భోజనం వండి పెట్టారు. అన్నం పెట్టే రైతన్న ఆకలితో ఉండడం దేశానికి మంచిది కాదని అంటున్నారు.
ఇదీ చూడండి: సింఘు సరిహద్దులో నిరాహార దీక్షకు రైతు సంఘాల పిలుపు