కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్ నేత జశ్వంత్ సింగ్‌కు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు కుటుంబ సభ్యులు, అభిమానులు. రాజస్థాన్ జోధ్‌పుర్‌లోని ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే అంత్యక్రియలు జరిగాయి. వేద మంత్రాల మధ్య ఆయన కుమారుడు మన్వేంద్ర సింగ్ అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు.
అంతకుముందు దిల్లీలోని ఆసుపత్రి నుంచి ఆకాశ మార్గాన జశ్వంత్ పార్థీవ దేశాన్ని జోధ్‌పుర్‌కు తీసుకొచ్చి, వ్యవసాయ క్షేత్రంలో సందర్శనార్థం ఉంచారు. అభిమానులు, బంధువులు ఆయనకు పుష్పాంజలి ఘటించారు. తమ అభిమాన నేతను కడసారి చూసుకునేందుకు పలువురు అక్కడికి చేరుకున్నారు. భారత సైన్యం తరఫున కూడా ఆయనకు నివాళులందాయి.
2014 నుంచి కోమాలోనే..
రాజస్థాన్‌కు చెందిన జశ్వంత్.. సైనికాధికారిగా పని చేస్తుండగానే రాజకీయల్లోకి వచ్చారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ మంత్రివర్గంలో ఆర్థిక, విదేశాంగ, రక్షణ వంటి కీలక శాఖలను నిర్వర్తించారు. 1980 నుంచి 2014 వరకు పార్లమెంట్ సభ్యుడిగా పని చేశారు. 2014లో ఇంట్లో జారి పడడం వల్ల మెదడుకు గాయమైంది. అప్పటి నుంచి అపస్మారక స్థితిలో ఉన్న ఆయన.. తీవ్ర అనారోగ్యానికి గురికావటం వల్ల ఈ ఏడాది జూన్‌లో దిల్లీలోని సైనిక ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్యం విషమించటం వల్ల సెప్టెంబర్ 27 ఉదయం ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు.
ప్రముఖుల సంతాపం..
కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ మృతిపట్ల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, భాజపా సీనియర్ నేత అడ్వాణీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
సైనికుడిగా, రాజకీయ నేతగా జశ్వంత్ సింగ్ దేశానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేసుకున్నారు ప్రధాని మోదీ. ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖల్లో ఆయన సేవలు ఎనలేనివన్నారు. సింగ్ కుటుంబానికి మోదీ సానుభూతి తెలిపారు.
గొప్ప దేశభక్తుడు: అడ్వాణీ
కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ అత్యుత్తమ పార్లమెంట్ సభ్యుడు, తెలివైన దౌత్యవేత్త, గొప్ప పాలనాదక్షుడు, అన్నింటికంటే మించి దేశభక్తుడు అని పేర్కొన్నారు భాజపా సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ. తనకు అత్యంత సన్నిహితుల్లో సింగ్ ఒకరని తెలిపారు. 1998-2004 మధ్య అధికారంలో ఉన్నప్పుడు వాజ్‌పేయీ, జశ్వంత్ జీ, తన మధ్య ప్రత్యేకమైన బంధం ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు.
ఇదీ చూడండి: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత