కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని దిల్లీలో నేడు కాస్త పరిస్థితి చక్కబడింది. తీవ్ర వాయుష్య కాలుష్యం కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో మూతపడిన పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. అయితే దిల్లీలో ఏటా ఇదే సమయానికి వాయు నాణ్యత ప్రమాదకర స్థాయిలో క్షీణిస్తోందని దౌత్యవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో పర్యావరణ అంశాలపై చర్చించేందుకు సమావేశం కానున్నట్లు తెలిపారు డిప్లొమాటిక్ కార్ప్స్ డీన్ ఫ్రాంక్ హెచ్డీ కాస్టెల్లానోస్. ఈ వారమే జరిగే భేటీలో కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యూహాలపై అధికారులతో సమాలోచనలు చేయనున్నట్లు తెలిపారు.
"దిల్లీ ప్రజలు పీల్చే గాలినే ఇక్కడి దౌత్యవేత్తలు పీల్చుకుంటారు. అందరి గురించి ఆందోళనగా ఉంది. పరిస్థితిని నియంత్రించేందుకు ఏం చేయాలనే విషయంపై విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమవుతాం. కాలుష్యం కారణంగా దిల్లీ వాసులతో పాటు ఇక్కడికి పర్యటన, వ్యాపార పనుల కోసం వచ్చే విదేశీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు."
-ఫ్రాంక్ హెచ్డీ కాస్టెల్లానోస్, డిప్లోమాటికి కార్ప్స్ డీన్.
2017లోనే కాలుష్యంపై నిరసన
దిల్లీలో కాలుష్య తీవ్రత కారణంగా 2017లోనే భారత్‌కు దౌత్య ప్రతినిధుల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. వాయు కాలుష్యం వల్ల దౌత్య కార్యాలయాల సిబ్బంది తమ విధులను సజావుగా నిర్వర్తించలేక పోతున్నట్లు అప్పట్లోనే విదేశాంగ శాఖకు నివేదించారు హెచ్డీ కాస్టెల్లానోస్.
వాయు నాణ్యత క్షీణంచి తమ సహోద్యోగులు, కుటుంబసభ్యులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని పలు ఎంబసీలు, హై కమిషన్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. ఆగ్నేయ ఆసియా కూటమి సభ్యుల్లోని ఇద్దరు దౌత్యవేత్తలు.. దిల్లీలో వాయుకాలుష్యం తీవ్రమైన సమయంలో ఇక్కడ ఉద్యోగాలు చేసేందుకు విముఖత వ్యక్తం చేశారు. మరికొందరు తమ షెడ్యూల్‌ను మార్చుకోవాలనుకున్నారు.
భారత్‌లో పోస్టింగ్‌ను క్లిష్టతరమైనదిగా ప్రకటించాలని 2017లో తమ ప్రభుత్యానికి లేఖ రాసింది థాయిలాండ్ రాయబార కార్యాలయం. కోస్టారికాకు చెందిన రాయబారి మరేలా క్రజ్ అల్వారెజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్పటి నుంచి దిల్లీలో విధులు నిర్వహించే తమ దేశాల ప్రతినిధులకు, సిబ్బందికి ముందు జాగ్రత చర్యల కింద పలు ఏర్పాట్లు చేస్తున్నాయి విదేశీ రాయబార కార్యాలయాలు.
మాస్క్‌లు, ఎయిర్ ప్యూరిఫయర్లు..
ఫ్రెంచ్ రాయబార కార్యాలయం తమ సిబ్బంది కోసం తీసుకున్న కాలుష్య నియంత్రణ చర్యలను ఈటీవీ భారత్‌కు వివరించారు అధికారిక ప్రతినిధి రెమీ తిరౌట్టవరాయనే. 2016లో దిల్లీలోని ఫ్రెంచ్ దౌత్య కార్యాలయంలో ఎయిర్ ప్యూరిఫయర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతవారం రెండు దేశాల పర్యావరణ శాఖ మంత్రులు సమావేశమై... వాతావరణ మార్పు వంటి అంశాలపై చర్చించినట్లు గుర్తుచేశారు రెమీ.
దిల్లీలో పనిచేసే తమ దేశ రాయబార కార్యాలయ సిబ్బందికి గత కొన్నేళ్లుగా ఫేస్ మాస్క్‌లను, ఎయిర్ ప్యూరిఫయర్స్‌ను అందుబాటులో ఉంచింది చైనా. అయితే డ్రాగన్ దేశంలా అందరికీ ఇవి అందుబాటులో ఉండవన్నారు జర్మన్ రాయబారి వాల్టర్ లిండర్. దిల్లీలో రిక్షా నడుపుకుని జీవనం కొనసాగించే కార్మికులు... మాస్క్‌లు, ఎయిర్ ప్యూరిఫయర్స్ కొనుగోలు చేయలేరని చెప్పారు.
సరి-బేసికి మద్దుతు
వాయు కాలుష్య నియంత్రణకు దిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరి-బేసి విధానాన్ని సమర్థించారు వాల్టర్. కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ఇలాంటి నూతన పద్ధతులు పాటించడం సబబేనని అభిప్రాయపడ్డారు. తాను కూడా ఈ విధానాన్ని అనుసరించాలనుకుంటున్నట్లు తెలిపారు. కాలుష్య నింయత్రణకు తీసుకునే ఏ చర్యనైనా స్వాగతించాలన్నారు.
దిల్లీ గేటు వద్ద నిరసన
వాయు కాలుష్యంపై నిరసనగా దిల్లీ గేటు వద్ద నిన్న నిరసనలు చేపట్టారు హస్తిన, ఇతర ప్రాంతాల వాసులు. కాలుష్య నియంత్రణకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో బ్లూ ప్రింట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
-(స్మితా శర్మ, సీనియర్ పాత్రికేయురాలు)
ఇదీ చూడండి: 'తీస్ హజారీ' వివాదం: మూడో రోజూ న్యాయవాదుల సమ్మె